అమెరికా అధ్యక్ష పదవి రేసులో హాట్ ఫేవరేట్ గా ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియా ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన హఠాత్తుగా చెవిని పట్టుకుని కింద పడిపోయారు. కాల్పుల శబ్దం కూడా వచ్చింది. దీంతో కాల్పులు జరిగాయని అర్థమైపోయింది. సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే ఆయనను అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. చెవికి గాయం అయి ఆ రక్తం ట్రంప్ మొహం మీద పడింది. ఈ కాల్పుల ఘటనతో ట్రంప్ ఏ మాత్రం భయపడలేదు సరి కదా.. మరింత బిగ్గరగా.. ఫైట్ ఫైట్ అని కేకలేశారు. ఇలా కేకలేస్తూండగానే ఆయనను సీక్రెట్ సర్వీస్ అధికారులు తీసుకెళ్లిపోయారు.
కాల్పులు జరిగినట్లుగా తెలియగానే ససీక్రెట్ సర్వీస్ స్నైఫర్స్ రంగంలోకి దిగారు. షూటర్ ని చంపేశారు. దుండగుడి కాల్పుల్లో ట్రంప్ మద్దతుదారుడు మరొకడు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ పై కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరు… ఎందుకు అలా చేశాడన్న విషయాలపై ఇంకా పూర్తి స్థాయి వివరాలు బయటకు రాలేదు. అమెరికాన్ లో విచ్చలవిడిగా దొరికే గన్నుల సంస్కృతిపై ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. చివరికి అది ట్రంప్ వద్దకు రావడం… పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది.
ట్రంప్, బైడెన్ ఇద్దరి మధ్య అమెరికా అధ్యక్ష రేసు హోరాహోరీగా సాగుతోంది. ఇరువురి రాజకీయ విధానాల్లో స్పష్టమైన తేడా ఉంటోంది. ట్రంప్ అగ్రెసివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన ద్వేషం పెంచుతున్నారన్న విమర్శలూ ఎదుర్కొంటున్నారు. కాల్పుల వ్యవహరానికి కారణం ఏమిటో… అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ కాల్పుల అంశం అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం మరింత దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. సాధారణంగా అత్యంత సురక్షితమైన భద్రతా వ్యవస్థలు కలిగి ఉన్న అమెరికాలోనే హాట్ ఫైవరేట్ ఉన్న అధ్యక్ష అభ్యర్థిపై దాడి … పెను సంచలనం రేపుతోంది.