తెలుగు చిత్ర పరిశ్రమ ఆగస్టు ఒకటో తేదీ నుంచి బంద్ అవుతోంది. షూటింగ్‌లన్నీ నిలిపివేస్తున్నామని దిల్ రాజు ప్రకటించారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయని నిర్మాతలు చెబుతున్నారు. అయితే ఇండస్ట్రీని నడిపేది నిర్మాతలే. ఎవరైనా వారిపైన అలుగుతారు కానీ.. వారు ఎవరిపైనా అలగడానికి చాన్స్ లేదు. కానీ ఇప్పుడు వారు తమకు చాలా సమస్యలు ఉన్నాయని షూటింగ్‌లు బంద్ చేస్తున్నారు. చాలా సమస్యలు ఏకరవు పెడుతున్నారు.కానీ వాటిని పరిష్కరించుకోవాల్సింది కూడా నిర్మాతలే. ఆ విషయంలో వారికే క్లారిటీ లేనట్లుగా ఉంది.
నిర్మాతలు తమ బిజినెస్ విషయంలో గట్టిగా లేకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి వచ్చింది. వ్యవస్థ గట్టిగా ఉండేనే.. ఏదైనా నిలబడుతుంది.కానీ టాలీవుడ్లో ఒకరిని మించి ఒకరు స్వార్థం కోసం నిర్ణయాలు తీసుకుని తమ నెత్తి మీద తాము చేతులు పెట్టుకున్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన నిర్వాకంతో మొదటికే మోసం వచ్చింది. తెలంగాణ సర్కార్ సహకరించినా …ప్రేక్షకులు ధియేటర్లకు రావడం లేదు. సినిమా బాగుంటేనే వస్తున్నారు. లేకపోతే ఒక్కరూ రావడం లేదు. నిజానికి బయట ఫ్లాప్ అయిన సినిమాలను ఓటీటీలోనూ చూడటం లేదు. కానీ ఈ నిజాన్ని ఒప్పుకోకుండా.. ఓటీటీని ఓ కారణంగా చూపించుకుంటున్నారు.
షూటింగ్‌లు ఆపేస్తే ఇప్పుడు నిర్మాతలకే నష్టం. ఎందుకంటే ఓ సినిమా ఒక్క రోజు ఆలస్యమైతే ఎంత నష్టం జరుగుతుందో నిర్మాతలకే తెలుసు. అది వారే భ రించాలి. ఎప్పటికైనా చేయాల్సిన షూటింగ్‌లు చేయాలి. తర్వాత ప్లాన్లు ఏమైనా ఉంటే సినిమాల నిర్మాణం అపేయవచ్చు. కానీ నిర్మాతలు తమ నష్టాన్ని భరించాడనికి సిద్ధపడి.. షూటింగ్‌లు ఆపేస్తున్నారు. దీని వల్ల ఇండస్ట్రీపై ఆధారపడన వారంతా నష్టపోతారు. అయితే నిర్మాతలకు ఎప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి.. ఎప్పుడు షూటింగ్‌లు ప్రారంభిస్తారనేది ఎవరూ అంచనా వేయలేని ప్రశ్న. ఎందుకంటే నిర్మాతల సమస్యలను పరిష్కరించుకునే కెపాసిటీ నిర్మాతలకే ఉంది. ఇతరులకు లేదు.