తెలంగాణలో మరిన్ని సడలింపులు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఎంటర్టెయిన్మెంట్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా సినిమా షూటింగ్లకు అనుమతి ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తోంది. ప్రభుత్వం పెట్టే నిబంధనలను అన్నింటినీ పాటించి షూటింగ్లు ప్రారంభించుకుంటామంటూ.. ఇప్పటికే సినీ, టీవీ రంగాల ప్రతినిధులు మంత్రి తలసానిని కలిసి విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు ఏ మాత్రం కనిపించకపోవడంతో ప్రజల రోజువారీ వ్యవహారాల్ని కొనసాగించేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే తరహాలో ఆర్టిసి బస్సులను నడిపే విషయంలో కూడా సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. రెండు నెలలుగా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోతున్న ఆర్టిసిని ఆర్ధిక నష్టాల నుంచి గట్టెక్కించడానికి వీలైనంత త్వరగా బస్సులను నడపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ బస్సులను నడపడం వల్ల కరోనా వైరస్ వ్యాపించకుండా… తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇప్పటికే కీలక ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఆర్టిఎ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెరుచుకున్నాయి.. గ్రీన్, ఆరంజ్ జోన్ లలో 100 శాతం ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభించారు.
రెడ్జోన్లు మినహా మిగిలిన గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లకు కూడా.. భౌతిక దూరం నిబంధనలు పెట్టి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కాంటాక్ట్ వ్యక్తుల పరీక్షలతో పాటు ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా ఖచ్చితమైన క్యారంటైన్ నిబంధనలు పాటించేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. శుక్రవారం కేసీఆర్ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.