అమరావతి నుంచి రాజధానిని తరలించాలని డిసైడ్ అయిపోయిన ఏపీ సర్కార్కు.. ఇప్పటికే అక్కడ ఖర్చు పెట్టిన రూ. పదివేల కోట్ల విషయంలో.. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయింది. పెద్ద ఎత్తున భవనాలు రెడీగా ఉండటం.. ప్యాచ్ వర్క్లు పూర్తి చేస్తే.. అధికార యంత్రాంగానికి మొత్తం సరిపోయే వసతి సమకూరే చాన్స్ కనిపిస్తోంది. రెండేళ్ల పాటు ఆ భవనాలను అలా వదిలేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాజధానిని తరలించాలంటే.. వాటిని ఏం చేయాలో కూడా చెప్పాల్సి ఉంటుంది. అందుకే… అప్పుడప్పుడు.. ఏదో ఓ సమీక్ష చేస్తూ.. త్వరలో పూర్తి చేయమని.. ఆదేశాలు ఇస్తూ ఉంటారు జగన్. కానీ.. ఇంత వరకూ అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.
అయితే ఇప్పుడు.. కొత్తగా ఆ భవనాలు ఎలా ఉపయోగపడతాయో .. నివేదిక ఇవ్వాలంటూ.. ఓ కమిటీని నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో తొమ్మిది మంది అధికారులతో కమిటీ ఉంటుంది. వీరు అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలిస్తారు. అవి ఎలా ఉపయోగపడతాయో అంచనా వేస్తారు. భవనాలు పూర్తి చేయాలా వద్దా… పూర్తి చేస్తే ఎలా ఉపయోగించుకోవాలి… అన్న అంశాలపై నివేదిక తయారు చేస్తారు. ఒక వేళ పూర్తి చేయకపోతే వాటినేం చేయాలన్నదానిపైనా ఈ తొమ్మిది మంది అధికారులు నివేదిక సిద్ధం చేస్తారు. ప్రభుత్వానికి ఖర్చు లేకుండా… అయ్యేలా.. నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో ప్రభుత్వం సూచించింది.
అంటే ఇప్పటి వరకూ.. సీఎం జగన్ సమీక్షల్లో.. మిగిలిన భవనాలను పూర్తి చేయమంటూ ఇచ్చిన ఆదేశాలు ఉత్తుత్తివే. ఇప్పుడు నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక ద్వారా … అమరావతి భవనాలను పూర్తి చేయాలా.. అమ్మివేయాలా అన్నది డిసైడ్ చేసే చాన్స్ ఉంది. అమరావతిపై ఇప్పటికే అనేకానేక కమిటీలు వేశారు. ఇది తాజా కమిటీ. గతంలో బొత్స సత్యనారాయణ ఓ సారి అమరావతి భవనాలను పరిశీలించారు. అప్పుడే.. వాటిని అమ్మకానికి పెట్టబోతున్నారన్న ప్రచారం జరిగింది. బహుశా దానికి అధికారుల నివేదిక అనే ప్రాతిపాదిక తీసుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ ప్రస్తుతం ప్రారంభమయింది.