తెలుగు చాలా సొగసైన భాష. అదే సమయంలో చాలా వైవిధ్యం వున్న భాష కూడా. తెలుగులో వుండే యాసలు మరే భాషలో లేవేమో. శ్రీకాకుళంలో ఓ యాస.. ఈస్ట్,వెస్ట్ లో మరోయాస. గుంటూరు, కృష్ణా,ప్రకాశం లో మరోటి. చీరలాలో మళ్ళీ మారిపోతుంది. నెల్లూరు మళ్ళీ వేరు. ఇక తెలంగాణ యాసలో వుండే అందం చెప్పక్కర్లేదు. అంతేనా రాయసీమలో వున్న నాలుగు జిల్లాల్లోనూ నాలుగు యాసలు వున్నాయి. చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపూర్.. మాట్లాడేది తెలుగే అయినా వారి యాసలో చిన్న తేడా, అందమైన సొగసు వుటుంది. అయితే ఇన్ని యాసలు వున్నా సినిమా యాస ఒకటి వుందని, అదే స్పష్టమైన తెలుగని కొందరు వితండవాదం చేస్తుంటారు. ఆ వితండవాదం పక్కన పెడితే ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కడపపై ఫోకస్ చేశాడు.
త్రివిక్రమ్ భాషబిమాని. స్వతహాగా రచయిత ఆయన త్రివిక్రమ్ అచ్చ తెలుగు పదాలతో హాస్యన్ని వినోదంను పంచారు. అయితే ఇప్పటివరకూ సోకాల్డ్ సినిమా తెలుగులోనే వినోదం పంచిన ఆయన ఇప్పుడు యాసపై ద్రుష్టి పెట్టారు. ”అత్తారింటికి దారేది” సినిమాలోనే కోట శ్రీనివాస్ రావు పాత్రతో చిత్తూరు యాస మాట్లాడించారు. బైసాట్లే, ఎనుము, ఇలాంటి పదాలు కోటశ్రీనివాస్ రావు పాత్రలో వినిపిస్తాయి. రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు గారి రిఫరెన్స్ తో ఆ యాస పెట్టానని చెబుతుంటారు త్రివిక్రమ్.
ఇప్పుడు త్రివిక్రమ్ కడప, రాజం పేట ప్రాంతాల యాసను సిల్వర్ స్క్రీన్ పై వినిపించబోతున్నారు. ఎన్టీఆర్ తో తీస్తున్న ”అరవింద సమేత” చిత్రంలో చాల వరకూ కడప, రాజాం పేటలో మాట్లాడుకునే యాస వినిపించబోతుంది. ఈ సంగతి టీజర్ రిలీజ్ తోనే తెలిసింది. అయితే ఇప్పుడు ఏకంగా అదే యాసలో ఓ రెండు పాటలు కూడా సినిమాలో పెట్టారు. ఇది వరకు చాలా సినిమాలు రాయలసీమ నేపధ్యంలో వచ్చాయి. యాస కూడా వినిపించింది. అయితే అదే యాసలో పాటలు కూడా పెట్టె ధైర్యం మాత్రం చేయలేదు. కానీ త్రివిక్రమ్ ఆ ధైర్యం చేశారు. ప్రస్తుతం గుండెల్ని పిండేస్తున్న ‘పినిమిటి’ పాట కడప యాసలోనే వుంది. అలాగే నిన్న రిలీజ్ చేసిన ”రెడ్డి ఇక్కడ సూడు’ పాట కూడా. బహుసా ఒక సినిమాలో కడప యాస, మాండలికలో వినిపించే ఫుల్ లెంత్ పాటలు ఇవేనేమో. త్రివిక్రమ్ లాంటి రచయిత , దర్శకుడు ఇలా యాసలపై ద్రుష్టి పెడితే గనుక తెలుగు భాషలో వుండే వైవిధ్యం, సొగసు అందం.. ఇప్పుడున్న తరం యువతందరికీ చేరే అవకాశం ఉటుంది. ఈ విషయంలో త్రివిక్రమ్ కి థ్యాంక్స్ చెప్పాల్సిందే.