హైదరాబాద్: కాల్‌మనీ రాకెట్లో ఉన్న నిందితులను ఎన్కౌంటర్ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. కాల్‌మనీ వ్యవహారంపై ఇవాళ ఉదయం విజయవాడలో నెహ్రూ మీడియాతో మాట్లాడారు. ఈ రాకెట్లో తెలుగుదేశంవారే ఎక్కువమంది ఉన్నారని ఆరోపించారు. రూరల్ ఎమ్మెల్యే, అర్బన్ ఎమ్మెల్యే ఉన్నారని ఈనాడు పత్రికే రాసిందని, వారెవరనేది అందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పార్టీలో ఎవరెవరికి ఈ వ్యవహారంలో ప్రమేయముందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఈ వ్యాపారులు తమ కార్యాలయాన్ని నడుపుతున్నారని చెప్పారు. మహిళలను హింసించి, న్యూడ్ వీడియోలు తీసి, వ్యభిచార వృత్తిలోకి కూడా దించారని ఆరోపించారు. కాల్‌మనీ వ్యవహారం విజయవాడకు తలవంపులు తీసుకొచ్చిందని అన్నారు. నిందితులందరిపై నిర్భయ చట్టం కింద కేసులు పెట్టాలని కోరారు. వారిని ఎన్కౌంటర్ చేయాలని, అలా చేస్తే తాను వ్యక్తిగతంగా చంద్రబాబునాయుడుకు సపోర్ట్ చేస్తానని చెప్పారు. చంద్రబాబు వారిపై కర్కశంగా వ్యవహరించాలని, ఇంకెవరూ ఇలాంటి పనులు చేయకుండా గుర్తుండేలా చేయాలని అన్నారు.
కాల్‌మనీ వ్యాపారులు కిలో రు.1,000 ఖరీదైన బియ్యాన్ని వాడుతున్నారని, వారానికి ఒక విదేశానికి టూర్‌కు వెళుతున్నారని నెహ్రూ చెప్పారు. 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినాకూడా తనకు ఆ స్థోమత లేదని అన్నారు. ప్రజల సొమ్ముతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆరోపించారు. కాల్‌మనీ వ్యాపారాన్ని సమూలంగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు.