పేదలకు అడ్డం పెట్టుకుని ఏపీ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం వివాదాస్పదం అవుతోంది. అమరావతి రైతులు ఇచ్చిన భూముల్ని ఏదో విధంగా అన్యాక్రాంతం చేద్దామని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. రాజధాని అమరావతిలో అన్ని ప్రాంతాల వారికీ ఇళ్లు ఇచ్చేలా సీఆర్డీఏ చట్టాన్ని మార్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం ఎంతోమంది రైతులు ఇచ్చిన భూములకు సీఆర్డీఏ సంరక్షకురాలిగా ఉంది. రాజధాని ప్రాంతంలో భూమి లేని పేదలకు మాత్రమే ఇళ్లు కట్టివ్వాలని సీఆర్డీఏ చట్టంలో ఉంది. అమరావతిలో భూములను ఇష్టానుసారం పంచడానికిగానీ అమ్మడానికిగానీ వీలు ఉండదు సీఆర్డీఏ చట్టాన్ని కూడా గతంలో ఏపీ ప్రభుత్వం తొలగించింది. కానీ మళ్లీ పునరుద్ధరించింది.
ఏపీ ప్రభుత్వం కేవలం రాజధాని భూసమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన భూముల్ని అదీ కూడా మాస్టర్ ప్లాన్లో కీలకమైన నిర్మాణాలకు కేటాయించిన ప్రాంతాన్ని పంచుతామని చెబుతోంది. నిజానికి రైతులు ఇచ్చిన భూములు కాకుండా ప్రభుత్వానికి కూడా భూములున్నాయి. వాటినీ ఇటీవలి కాలంలో వేలం వేస్తోంది. అలా వేయకుండా వాటిని పేదలకు ఇస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు . కానీ చట్టంలో రైతులిచ్చిన భూముల వినియోగంపై స్పష్టమైన కార్యాచరణ ఉండగా వాటిని ఉల్లంఘించేలా వ్యవహరిస్తూండటనే వివాదం వస్తోంది.
పేదలను అడ్డం పెట్టుకుని కుట్రలు చేయడం తప్ప.. వారికి ఇళ్లు.. ఇళ్ల స్థలాలు ఇద్దామన్న చిత్తుశుద్ధి ప్రభుత్వానికి లేదు. ఈ విషయం స్పష్టమవుతోంది. అందుబాటులో ఉన్న స్థలాలు అమ్మకానికి పెట్టి.. అసలు అమ్మడానికి లేదా అసైన్ చేయడానికి వీలుపడని భూముల్ని పేదలకు ఇస్తామని న్యాయవివాదాల్లోకి తెచ్చి పేదల బతుకులతో ఆటలాడుతోంది. ఈ విషయాలు అందరికీ అర్థమవుతాయి. కానీ కొంత మంది మాత్రం పేదలకు ఇళ్లిస్తామంటే అడ్డుకుంటున్నారని చిల్లర రాజకీయాలుచేస్తూంటారు. అలాంటి వారికి కావాల్సింది పేదలకు ఇళ్లు కాదు… వారిని తమ నాయకుల రాజకీయానికి బలి చేసైనా సరే రాజకీయ ప్రయోజనాలు కలిగేలా చేయడమే !