పదేళ్లుగా బెయిల్ ఉన్న జగన్ రెడ్డి బెయిల్ ను ఇప్పుడే రద్దు చేయాలా అని సుప్రీంకోర్టు రఘురామ తరపు లాయర్ ను ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ తరపు లాయర్లు సుప్రీంకోర్టును కోరారు. ఈ క్రమంలో సీఎం జగన్, సీబీఐ సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. గత పదేళ్లుగా జగన్ బెయిల్పై ఉన్నారని, అధికారంలోకి వచ్చాక సాక్ష్యాలు చెరిపేస్తున్నారని.. వెంటనే బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
సాక్ష్యాలు చెరిపేస్తున్నారు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా..? అని ధర్మాసనం ప్రశ్నించింది. కేసు పూర్వాపరాలు, జరిగిన ఘటనలపై లిఖితపూర్వకంగా వివరాలను రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు అందించారు. జగన్కు బెయిల్ మంజూరు చేసిన తర్వాత.. దర్యాప్తు సంస్థలు ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు.
ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి దిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి తొలి వారానికి వాయిదా వేసింది.