ఆంధ్రప్రదేశ్ సమస్యలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఏదో ఒక స్పష్టత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశిస్తోంది. అందుకే, ప్రతీరోజూ పార్లమెంటులో టీడీపీ ఎంపీలు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. కేంద్రం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పార్లమెంటు వేదికగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయినాసరే, భాజపా సర్కారు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఏపీ నేతలు చేస్తున్న ఆందోళన తీవ్రతను పరిగణనలోకి తీసుకోనట్టుగానే ఢిల్లీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా కేంద్రం దిగిరావడం కాస్త అనుమానంగానే కనిపిస్తోంది. బుధవారం నాడు ఢిల్లీలోని ఏపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత అనుసరించాల్సిన పోరాట సరళి గురించి ఆయన మాట్లాడం గమనించాల్సిన విషయం.
పార్లమెంటు సమావేశాలు ముగియగానే రాష్ట్రంలోనూ, జిల్లా స్థాయిలో పోరాటాలు ఉద్ధృతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పార్లమెంటు జరుగుతున్నంత కాలం ఢిల్లీ వేదికగానే ఆందోళన చేస్తామనీ, ఆ తరువాత రాష్ట్రంలో కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఆర్థిక బిల్లులను హడావుడిగా పూర్తి చేసి, పార్లమెంటు నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందనీ, అందుకే.. ఈ బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలోనే హోదాతోపాటూ ఆర్థిక లోటు అంశంపై చర్చకు పట్టుపబట్టాలని ఎంపీలకు సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలకు ఎవ్వరూ గైర్హాజరు కావొద్దని చంద్రబాబు కోరారు.
పార్లమెంటు సమావేశాల తరువాత అనుసరించాల్సిన వైఖరిపై చంద్రబాబు మాట్లాడటం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఎందుకంటే, ఈ సమావేశాలు ముగిసేలోగా ఏదో ఒకటి తేలిపోతుందని అనుకున్నారు. కానీ, చంద్రబాబు వ్యాఖ్యలను బట్టీ చూస్తుంటే పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే పరిస్థితి దగ్గర్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అందుకే, ఈలోగా ఢిల్లీ వేదికగా మరింత తీవ్రంగా పోరాటం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిస్తున్నారు. ఒకసారి పార్లమెంటు సమావేశాలు అయ్యాక.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోరాటం అంటున్నారు. చేయాల్సిందేదో ఢిల్లీ వేదికగా చేస్తేనే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది కదా. అయినా, దేశమంతా చూస్తున్న పార్లమెంటులోనే నిరసనలు తెలుపుతుంటే పట్టించుకోని భాజపా, ఇక రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలకు స్పందిస్తుందా..? మొత్తానికి, ఈ పార్లమెంటు సమావేశాల్లో ఏపీకి ఏదో మేలు జరుగుతుందనే ఆశలు నెమ్మదిగా సన్నగిల్లుతున్నట్టే కనిపిస్తున్నాయి.