జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాన బలం ఆయన అభిమానులు అయితే రెండవ బలం ఆయన వాగ్దాటి. అయితే ఇటీవల – ఆయన ఉపన్యాసాల ధోరణిలో మార్పు రావాలని ఆయన అభిమానుల్లో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
పార్టీ పెట్టిన తొలి నాళ్లలో ఆకట్టుకున్న ఉపన్యాసాలు:
నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్నంతకాలం స్టేజ్ ఎక్కాలంటే తెగ మొహమాట పడిపోయేవాడు. కొన్ని సినిమా ఫంక్షన్లలో అభిమానులు నాలుగైదు గంటల పాటు ఆయన కోసం ఎదురు చూస్తే ఆయన చివర్లో నాలుగైదు నిమిషాలు ప్రసంగించి వెళ్ళిపోయే వారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చే ముందు అనేక అంశాలతో పాటు తన ఉపన్యాస శైలి గురించి కూడా ఆయన కసరత్తు చేసినట్టుగా అర్థమవుతుంది. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఆయన ఉపన్యాసాలు యువతను ఆకట్టుకోవడమే దీనికి నిదర్శనం. జనసేన పార్టీని స్థాపించిన మొదటి రోజు ఇచ్చిన స్పీచ్ కానీ, ఎన్నికలయ్యాక బిజెపిని పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ విమర్శించిన ఉపన్యాసం కానీ అప్పట్లో ఆయనకు ఎంతో మంది అభిమానులను సాధించి పెట్టింది. ఇక వైఎస్సార్సీపీ అధినేత జగన్- సాక్షి మీడియా ఉండి కూడా మూడేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం మీద క్రియేట్ చేయలేకపోయిన యాంటీ ఇన్కంబెన్సీని పవన్ కళ్యాణ్ 2018 మార్చి 14న ఇచ్చిన ఒక్క స్పీచ్ తో క్రియేట్ చేయగలిగాడు అని ఆయన అభిమానులతో పాటు వైకాపా శ్రేణులు కూడా అంటూ ఉంటారు.
స్వోత్కర్ష కి సమయం తగ్గించి ప్రజా సమస్యలపై ఎక్కువగా మాట్లాడాలి:
అయితే ఇటీవలి కాలంలో ఆయన భీమవరం పర్యటించినప్పుడు ఆయన ఉపన్యాసాలు విన్న అభిమానులు పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల లో కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలో దాదాపు 70 శాతం వరకు స్వోత్కర్ష ఉంటుంది. మిగిలిన 30 శాతం మాత్రమే ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉంటారు అన్న అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది.
స్వోత్కర్షలో భాగంగా, పవన్ కళ్యాణ్ తాను ఎంత మంచి వాడినో ప్రజలకు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు, అలాగే టీఆర్ఎస్ వంటి కొన్ని పార్టీలు తన మీద కక్ష గట్టాయని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజారాజ్యం పార్టీ సమయంలో కొంతమంది నాయకులు అలా వ్యవహరిం చారు ఇలా వ్యవహరించారు అని సింపతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమి ఐనా తన మంచితనం గురించి, తన కుటుంబం మంచితనం గురించి, తమ మీద జరుగుతున్న దాడుల గురించి ఎక్కువ సేపు చెబుతూ ఉండడం వల్ల, ప్రత్యేకంగా ఒనగూడే ప్రయోజనం అంటూ ఏదీ ఉండదు. ఉదాహరణకు, మొన్నటి భీమవరం పర్యటనలో మాట్లాడుతూ ఇటీవల తాను ఒక వాచ్ ఎక్కడో మర్చిపోతే, ఒక అభిమాని దాన్ని తన వద్దకు చేర్చడం ఒకవేళ తాను వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి ఉంటే అతను అలా చేసి ఉండేవాడు కాదు అని వ్యాఖ్యానించాడు. ఇటువంటి ఉదాహరణలు అప్పుడు విన్న అభిమానులకు ఆనందాన్ని ఇచ్చినప్పటికీ, సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ, ఒక ఓటరు ను తాను పవన్ కళ్యాణ్ కి భవిష్యత్తులో ఓటు వేయాలి అని తీర్మానించుకునే విధంగా మాత్రం ప్రభావితం చేయలేవు.
ఒకవేళ ప్రజలు, జనసేన పార్టీకి ఓటు వేస్తే బాగుంటుందని అనిపించేలా చేయాలంటే పవన్ కళ్యాణ్, దీనికి బదులుగా 70 శాతం సమయాన్ని ప్రజల సమస్యల మీద- అవి స్థానిక సమస్యలు కావచ్చు లేదా రాష్ట్ర స్థాయి సమస్యలను కావచ్చు, వాటిమీద మాట్లాడవలసి ఉంటుంది. పదే పదే తన ఉపన్యాసాలలో ఎక్కువ భాగం ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే ప్రజలలో కూడా ఏదో ఒక సమస్యపై మాట్లాడుతున్న సమయంలో ఆ నాయకుడి తో కనెక్షన్ ఏర్పడుతుంది. ప్రజా సమస్యల మీద ఫోకస్ చేస్తూ ఇలా మాట్లాడిన తర్వాత, ఒకవేళ మరీ అవసరం అనుకుంటే మిగిలిన 30 శాతం సమయంలో ఇటువంటి సొంత విషయాలు గురించి మాట్లాడుకున్నారు పరవాలేదని జనసేన పార్టీని అభిమానించే వాళ్ళే అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద:
నిజానికి చెప్పుకోవాలంటే మన రాజకీయ నేతల్లో చాలామంది మంచి వక్తలు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ గొప్ప వక్తలు ఏమీ కాదు. తెలంగాణ అధినేత కేసీఆర్, భారత ప్రధాని మోడీ లాంటి నేతలకు మాత్రం వారి వాగ్ధాటి గొప్ప వరం. చంద్రబాబు జగన్ లాంటి నేతల తో పోలిస్తే చక్కటి వాగ్ధాటి కలిగిన పవన్ కళ్యాణ్ తన వాక్చాతుర్యాన్ని ప్రజా సమస్యల మీద బలంగా మాట్లాడడానికి, ప్రజల తరఫున మాట్లాడడానికి ఎక్కువగా ఉపయోగిస్తే కచ్చితంగా ఆ పార్టీకి మరింత మంచి భవిష్యత్తు ఉంటుంది.