ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టారని సీఐడీ సుమోటోగా కేసు పెట్టి పుట్టినరోజు నాడే రఘురామను అరెస్ట్ చేసింది. ఆ రోజు రాత్రే తీవ్రంగా కొట్టారు. ఆ కేసు సెక్షన్లలో రాజద్రోహం కూడా ఉంది. ఇతర సెక్షన్లు కూడా ఉన్నాయి. రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టు విచారణ వద్దని చెప్పడంతో ఇతర సెక్షన్లపై విచారిస్తామని సీఐడీ పోలీసులు హైకోర్టును కోరారు. దానికి హైకోర్టు అంగీకరించింది. అయితే గతంలో సీఐడీ ఇలా విచారణ పేరుతో తీసుకెళ్లి కొట్టారు కాబట్టి ఈ సారి సీఐడీ ఆఫీసుల్లో విచారణ వద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
హైదరాబాద్ దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో లాయర్ సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. అలాగే సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా లాయర్ సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.
ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఏబీఎన్, టీవీ ఫైవ్‌లో రచ్చబండ పేరుతో పెడుతున్న ప్రెస్మీట్లు శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్నాయని సీఐడీ అధికారులు తమంతట తాము అనుకున్నారు. ఆయన రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్చను ఉపయోగించుకుటున్నారని అనుకోలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని కూడా రాజద్రోహంగా పరిగణించారు. రాజద్రోహం మినహా ఇతర సెక్షన్ల కింద విచారణకు అనుమతి రావడంతో సీఐడీ ఎప్పుడైనా ఇక రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బహుశా..రఘురామ నర్సాపురం వెళ్తానని చెబుతున్న నాలుగో తేదీన ఆయనను విచారణకు పిలిచే చాన్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.