వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. మోడీ హవాకు మరోసారి కాంగ్రెస్ విలవిల్లాడింది. 2014లో కేవలం 44 సీట్లు మాత్రమే సొంతంగా దక్కించుకుంటే, ఇప్పుడా నంబర్ 52 ఎంపీ స్థానాలకు పెరిగింది. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఈ నంబర్ ఏమాత్రం గౌరవప్రదమైంది కాదు. అందుకే, వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటారు అనే ప్రచారం జరిగింది. ఇదే అంశం సీడబ్ల్యూసీ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ.. తాను పార్టీ కోసం పోరాటం చేశానని అన్నారు. ఈ పోరాటాన్ని మనం కొనసాగించాలనీ, కానీ తాను ఒక సైనికుడిగా ఈ పోరాటంలో భాగస్వామిని అవుతాననీ, పార్టీ అధ్యక్షుడిగా కాదని భావోద్వేగంతో రాహుల్ చెప్పినట్టుగా తెలుస్తోంది!
అయితే, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ఆలోచన విరమించుకోవాలంటూ సమావేశంలో ఉన్న ప్రముఖ నేతలంతా రాహుల్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని సమాచారం. సోనియా, ప్రియాంకా కూడా చాలాసేపు రాహుల్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇదే చర్చ కాసేపు కొనసాగాక… సమావేశం నుంచి రాహుల్ గాంధీ వెళ్లిపోయారనీ, బుజ్జగింపులపై ఎలాంటి స్పందనా ఇవ్వకుండా బయటకి వెళ్లారని సమాచారం. చివరిగా ఆయన ఓ మాట అన్నట్టుగా తెలుస్తోంది! అదేంటంటే… కాంగ్రెస్ పార్టీకి తానే అధ్యక్షుడిగా ఉండాల్సిన అవసరం ఏముందనీ, ఎవరైనా ఉండొచ్చనీ, అవసరమైతే గాంధీ కుటుంబంతో నిమిత్తం లేకుండా ఎవరికైనా బాధ్యతలు ఇవ్వొచ్చని రాహుల్ అన్నట్టుగా సమాచారం. ఈ వ్యాఖ్యపై ప్రముఖంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
నిజానికి, ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా..? అది సరైన నిర్ణయం అవుతుందా… అంటే, కాదని చెప్పాలి. ఎందుకంటే, గత డిసెంబర్ లో దేశంలోని అత్యంత కీలకమైన మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అది రాహుల్ అధ్యక్షతన వచ్చిన గెలుపే కదా. ఒకవేళ అధ్యక్షుడుగా రాహుల్ విఫలమైతే… రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో పార్టీ విజయపథాన దూసుకెళ్లేది కాదు కదా! భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా మోడీ వెర్సెస్ రాహుల్ అన్నట్టుగానే పోటీ పోటీ ఎన్నికల్లో కాంగ్రెస్ తలపడింది. వాస్తవం మాట్లాడుకుంటే… ఇలాంటి సమయంలోనే పార్టీకి నాయకుడి అవసరం ఎక్కువ. నాయకుడే అస్త్ర సన్యాసానికి సిద్ధపడితే… కిందిస్థాయి నాయకులకు మార్గదర్శకంగా నిలిచేదెవరు..?