చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు, సెటాప్ బాక్సుల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని , ఫైబర్ నెట్లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం మొత్తం కేసును సీబీఐకీ అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారి తీసింది. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి కేసులు సర్వసాధారణమేనని కొందరు అంటూ ఉంటే, సరైన సమయంలో అప్రమత్తం కాకపోతే మొదటికే మోసం వస్తుందని, మరికొందరు అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఈ పరిణామాన్ని తేలికగా తీసుకోవచ్చా?
ఇవాళ దాదాపు అన్ని టీవీ చానల్స్ లో ఈ అంశంపైన డిబేట్స్ నడిచాయి. ఏబీఎన్ లో డిబేట్ నిర్వహించిన వెంకటకృష్ణ ” అసలు చంద్రన్న తోఫా, క్రిస్మస్ కానుక వంటి చిన్న చిన్న విషయాల పై కేసులు ఏంటి అని సిబిఐ జగన్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చితే అప్పుడు ఈ మంత్రివర్గం పరువే పోతుంది” అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించే ప్రయత్నం చేసినప్పటికీ, ఏబీఎన్ ఛానల్ లో జరిగిన డిబేట్ చూసిన వారికి ఈ కేసు ఎక్కడిదాకా వెళుతుందో అన్న భయం టిడిపి నేతల లోనే కాకుండా టిడిపి అనుకూల ఛానల్స్‌లో కూడా ఉన్నట్లు అనిపించింది. అయితే టీవీ9 డిబేట్ లో పాల్గొన్న బండారు వంటి టిడిపి నేతలు ఇవన్నీ సర్వసాధారణమేనని , ఇలాంటి కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవని మాట్లాడుతుండగా, డిబేట్ నిర్వహించిన రజనీకాంత్ మాత్రం, రాజకీయాల్లో ఎంత చిన్న కేస్ అయినా కూడా అది ఎటువంటి పరిణామాలకైనా దారి తీయవచ్చని, ఇంకా చెప్పాలంటే ఫైబర్ గ్రిడ్ కేసు లోకేష్ మెడకు చుట్టుకునే దాకా రావచ్చని టిడిపి నేతను సరి చేసే ప్రయత్నం చేశారు.
జగన్ కక్ష సాధింపు చర్యేనా?
డిబేట్ లలో మాట్లాడిన టిడిపి నేతలు మాత్రం ఇది కేవలం జగన్ కక్ష సాధింపు చర్య అని, తాను జైల్లో ఉండి రావడం వల్ల ఇప్పటికీ జగన్ విమర్శలను భరిస్తూ ఉన్నాడని, చంద్ర బాబును కూడా కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచితే , తన జైలు జీవితం పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పు కోవడానికి వీలుగా ఉంటుందని జగన్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ మాట్లాడారు. చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి నేతలు – తన సొంత బాబాయ్ హత్య జరిగి ఏడాది కావస్తున్నా ఆ కేసును సిబిఐకి అప్పగించి ఆ కేసులో పురోగతి వచ్చేలా జగన్ చేయలేకపోతున్నారని, ముందు జగన్ దానిపై దృష్టి సారిస్తే బాగుంటుందని విమర్శించారు.
బిజెపి ప్రోద్బలం ఉందా?
దీనికి తోడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సీబీఐకి కేసు అప్పగించడం వెనుక బిజెపి ప్రోద్బలం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం , పొత్తులు భంగం కావడం సాధారణమే అయినప్పటికీ, చంద్రబాబుకు బిజెపికి మధ్య రాజకీయ పొత్తుల కు మించిన వైరం ఏర్పడడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చ కూడా నడుస్తుంది. చంద్రబాబు ఆంధ్ర ప్రదేశ్ ని పాలిస్తున్న సమయంలో, కేంద్రాన్ని పాలిస్తున్న పార్టీకి అధ్యక్షుడిగా, హోం మంత్రిగా ఉన్న అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు ఆయనపై కొందరు రాళ్లు రువ్వడం వెనుక టిడిపి ప్రమేయం ఉందన్న అభిప్రాయం కొందరు బిజెపి నేతల లో ఉంది.
ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో ఇలాంటి కేసులు సర్వసాధారణమే అని ఏమరుపాటుగా ఉంటే అది ఎటువంటి పరిణామాలకైనా దారితీయవచ్చని, చంద్రబాబు అప్రమత్తమై మరింత విపత్కర పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవలసిన అవసరం ఉందని ఆ పార్టీ అభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.