‘ఖైది నెం. 150’ హిట్ తరవాత కూడా వినాయక్ ఖాళీగా ఉన్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. బాహుబలి తరవాత రికార్డులన్నీ.. ఖైదీ పేరిటే ఉన్నాయి. అలాంటి దర్శకుడు హీరోల కోసం వెదుక్కోవడం విచిత్రమే. ఖైది తరవాత చాలా గ్యాప్ తీసుకుని సాయిధరమ్ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్’ తీశాడు. అదేమంత ఇంటిలిజెంట్ మూవ్ కాదని, ఆ తరవాత అర్థమైంది. ఆ సినిమా ఫ్లాప్‌తో వినాయక్ మరింత ఇబ్బందుల్లో పడిపోయాడు. బాలకృష్ణతో కాంబినేషన్ తెరపైకి వచ్చినా… అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పటికీ ‘బాలయ్యతో సినిమా లైన్లోనే ఉంది’ అంటున్నాడు. బాలయ్య – వినాయక్ కాంబినేషన్ ఉండొచ్చు, ఉండకపోవొచ్చు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఓకే అయినా.. బాలయ్య ఖాళీ అవ్వడానికి టైమ్ పడుతుంది. ‘ఎన్టీఆర్’ అయిన వెంటనే బోయపాటి శ్రీనుతో ఓ సినిమా మొదలవుతుంది. అదెప్పుడు పూర్తవుతుందో తెలీదు. అప్పటి వరకూ వినాయక్ ఖాళీగా ఉండలేడు కదా? ఎప్పుడైతే బాలయ్య ‘ఎన్టీఆర్’ పనుల్లో పడిపోయాడో.. అప్పుడు వినాయక్ మరో ఆప్షన్ చూసుకోవాల్సింది. అయితే ఇప్పటికీ ‘బాలయ్య సినిమా’నే నమ్ముకోవడం ఏమిటో అర్థం కాదు. టాప్ దర్శకులంతా బిజీగా ఉన్న సమయంలో వినాయక్‌లాంటి మాస్ దర్శకులు హీరోల కోసం ఎదురు చూడడం వింతగానే ఉంది. అఖిల్, ఇంటిలిజెంట్ ఫ్లాపుల మహత్మ్యమే ఇదంతా.