సొంత పార్టీపైన తీవ్ర విమర్శలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాలపై వ్యాఖ్యలు చేయడంతో నోటీసులు ఇవ్వాలని హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోమటిరెడ్డికి అందిన తాజా నోటీసులపై ఈ నెల 27లోగా సరైన సమాధానం ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఆలోపు స్పందించకపోతే, చర్యలు తప్పవని కూడా పార్టీ హెచ్చరించింది! అయితే, తాజా నోటీసులపై ఎలా స్పందిస్తారు అనే అంశాన్ని రాజగోపాల్ ని అడిగితే… దానికి స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఇప్పట్లో తాను స్పందించేది లేదనీ, తన నిర్ణయం ఏంటనేది మీడియా అందర్నీ పిలిచి చెప్తా అన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా త్వరలోనే ప్రకటన చేస్తానన్నారు. ఇప్పుడు తాను దేనికీ రియాక్ట్ కాననీ, టైమ్ వచ్చినప్పుడు కచ్చితంగా అన్నింటికీ సమాధానం చెప్తాననీ, ఆ టైమ్ కోసం వెయిట్ చెయ్యండని మీడియాకు చెప్పారు.
అంటే, పార్టీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసులపై ఆయన సమాధానం 27లోగా ఉండదనే అనిపిస్తోంది. నిజానికి, గత ఏడాది కూడా ఎన్నికల సమయంలో ఇలానే పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు ఎదుర్కొన్నా, దానికి సరైన సమాధానం ఇవ్వలేదాయన! ఇప్పుడు మరోవారం టైమ్ ఉంది కాబట్టి, రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. నిజానికి.. నిన్ననే హైదరాబాద్ లోని స్వగృహంలో మునుగోడుకు చెందిన ఓ 50 మందితో రాజగోపాల్ రెడ్డి సమావేశమై రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్టు సమాచారం. అంతేకాదు, ఇవాళ్ల (గురువారం) సాయంత్రం కూడా కొంతమందితో సమావేశం కాబోతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవారం రోజుల్లోగానే భాజపాలో చేరిపోయి, అనంతరం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే వ్యూహంలో ఉన్నట్టు సమాచారం.
అయితే, కోమటిరెడ్డి షోకాజ్ నోటీసులకు స్పందించకపోతే… పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది. ఆ తరువాత, ఆయన భాజపాలో చేరితే… వెంటనే స్పీకర్ దగ్గరకి వెళ్లి, రాజగోపాల్ మీద అనర్హత వేటు వేయాలని కోరే అవకాశం ఉంది. పార్టీపరంగా ఆయనపై పక్కాగా చర్యలుండాలనీ, పార్టీలోని ఇతర నేతలకు కూడా అవి హెచ్చరికలుగా పని చేస్తాయనే వ్యూహంతో కాంగ్రెస్ ఉందని సమాచారం.