నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నెల్లూరులో మాఫియా రాజ్యం ఏలుతోందంటూ.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపాయి. ఇలాంటి వ్యాఖ్యలను ప్రస్తుత పరిస్థితుల్లో సహిస్తే.. అది అన్ని జిల్లాలకు వ్యాపిస్తుందని.. ఆ తర్వాత పార్టీ అదుపు తప్పుతుందన్న భావనతో.. వైసీపీ హైకమాండ్ శరవేగంగా దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. అయితే.. అవి ఆనంను బుజ్జగించడం కాకుండా.. ఆయనపై చర్య తీసుకునే దిశగా ఉన్నాయి. ముందుగా.. ఆయన వ్యాఖ్యలపై వివరణ కోరుతూ.. షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే వైసీపీ వర్గాలు.. ఆనంపై వ్యతిరేక ప్రచారం ప్రారంభించాయి. వెంకటగిరి నియోజకవర్గంలో ..జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం.. ఆనంకు నచ్చలేదని.. ప్రజాధనాన్ని ఆదాయం చేయడాన్ని ఆయన సహించలేక.. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా మాట్లాడుతున్నారన్న ప్రచారాన్ని.. అంతర్గతంగా ప్రారంభించాయి. ఆయన మంత్రి అనిల్ ను గురి పెట్టారని… వైసీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. బెట్టింగ్, భూ, ఇసుక మాఫియా అంటే.. మంత్రి అనిలే గుర్తుకు వస్తారన్న ఉద్దేశంతో అలా వ్యాఖ్యానించారని చెబుతున్నారు.
నిజానికి మంత్రి అనిల్ కుమార్ తండ్రి .. ఆనం కుటుంబం సాయంతోనే రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ఆకస్మిక మృతితో అనిల్ కుమార్.. రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆనం స్థానాన్ని ఆయన కైవసం చేసుకున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి ఇది కూడా అసంతృప్తిగా ఉంది. జిల్లాలో అత్యంత సీనియర్ను అయిన తనకు.. కేవలం.. నియోజకవర్గ నేతగా మార్చడాన్ని ఆయన భరించలేకపోతున్నారంటున్నారు. ఇప్పుడు.. ఈ షోకాజ్ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని వైసీపీలో ఆసక్తి వ్యక్తమవుతోంది.