‘వేదం’లో అనుష్క, ‘పవిత్ర’లో శ్రియ, హిందీ సినిమా ‘డి డే’లో శృతి హాసన్ వేశ్య పాత్రల్లో నటించారు. అంతకు ముందు ఆ తరవాత పలువురు కథానాయికలు వేశ్యలుగా నటించారు. వేశ్య వృత్తిలోని బాధను వెండితెరపై తమ నటనతో చూపించి మెప్పించారు. వేశ్యలుగా నటించిన కథానాయికల జాబితాలో తాజాగా చేరిన అందాల భామ శ్రద్ధా దాస్. ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’తో తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి, తరవాత అల్లు అర్జున్ ‘ఆర్య 2’, ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈ బెంగాలీ భామకు అదృష్టం కలిసిరాలేదు. సరైన విజయాలు లేక కెరీర్ ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. అయితే.. శ్రద్ధా దాస్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో ప్రయత్నాలు చేస్తూనే వుంది. వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చేస్తుంది. అలాగే వేశ్య పాత్రకు ఓకే చెప్పింది. అయితే… ఆమె వేశ్యగా నటిస్తున్నది సినిమాలో కాదు. షార్ట్ ఫిలింలో. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ దీపక్ పాండే దర్శకత్వం వహిస్తున్న షార్ట్ ఫిలిం ‘శృంగారదాన్’లో శ్రద్ధా వేశ్యగా కనిపించనుంది. ఇందులో వేశ్య వృత్తికి వ్యతిరేకి అయిన మధ్య వయస్కుడితో ప్రేమలో పడిన షైబ అనే అమ్మాయిగా నటిస్తున్నది. త్వరలో ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయనున్నారు.