తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి తాను సిద్ధమే అని శ్రద్ధా కపూర్ అన్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ ఫిల్మ్ ‘సాహో’. తెలుగు, హిందీ భాషల్లో తీస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో ఎలాగో డబ్బింగ్ ఆమె చెప్పుకుంటారు. తెలుగు సంగతేంటి? షూటింగులో ప్రభాస్ తనకు తెలుగు డైలాగులు చెప్పడంలో సహాయం చేశాడని మొదట్లో శ్రద్ధ కపూర్ తెలిపారు. అయితే… ప్రాంప్టింగ్ లేకుంగా డైలాగులను గుర్తుపెట్టుకుని మరీ చెప్పానని ఆమె అన్నారు. సెట్స్‌లో దర్శకుడు సుజీత్ తన వాయిస్ లోకల్ తెలుగు అమ్మాయిలా వుందని చెప్పడంతో చాలా సంతోషించానని శ్రద్ధా సెలవిచ్చారు. అయితే… తెలుగు డబ్బింగ్ తను చెప్పాలా? వద్దా? అనే విషయంలో దర్శకుడు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సుజీత్ సరేనంటే తెలుగులో శ్రద్ధా కపూర్ డబ్బింగ్ చెబుతారట! ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో యూరప్‌లో జరగనుంది. హిందీ నటులు నీల్ నితిన్ ముఖేశ్, చుల్బుల్ పాండే, జాకీ ష్రాఫ్, తమిళ నటుడు అరుణ్ విజయ్, మలయాళీ నటుడు లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.