ప్రత్యేక తెలంగాణ కోసం ఉధృతంగా పోరాటం జరుగుతున్న సమయంలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలోనే ఉన్నారు. ఆ వేదిక మీదినుంచే పోరాడారు. కానీ ఆ తర్వాతి పరిణామాల్లో పార్టీని వీడి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీకి అధికార ప్రతినిధి కూడా అయ్యారు. చాలా సందర్భాల్లో అధికార తెరాస మీద నిశిత విమర్శలతో విరుచుకుపడడాన్ని అలవాటు చేసుకున్నారు. అలాంటి దాసోజు శ్రవణ్ ఇప్పుడు జీవో నెంబర్ 207 విషయంలో ప్రభుత్వానికి చెమటలు పట్టించారు. ఎక్స్అఫీషియో ఓట్లకు సంబంధించిన వివాదంలో ప్రభుత్వ జీవో మీద హైకోర్టులో పిటిషన్ వేసి.. సర్కారు వెనక్కు తగ్గేలా చేశారు. అయితే తాజాగా జీవో రద్దు చేసి, ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడంపై దాసోజు శ్రవణ్ ఉడికిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇది నూటికి నూరుశాతం వంచన అని, ఈ ఆర్డినెన్స్‌ను కూడా న్యాయపరంగానే అడ్డుకోవాలని శ్రవణ్ అనుకుంటున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దీనికి సంబధించి శుక్రవారం ఉదయంనుంచే ఆయన తన న్యాయవాది, తనకు సన్నిహితులైన నిపుణులతో చర్చిస్తూ.. ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా హైకోర్టులో కొత్తగా పిటిషన్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సర్కారు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవశం చేసుకోవడానికి ఈ జీవో ద్వారా తమది కాని ఒక అదనపు బలాన్ని ‘సృష్టించుకోవడానికి’ ప్రయత్నించింది. అయితే దానికి కోర్టు బ్రేకులేసే పరిస్థితి వచ్చింది. అందుకే సర్కారు వెంటనే ఆర్డినెన్స్ తెచ్చేసింది. నిన్న సాయంత్రం వరకు న్యాయస్థానంలో విచారణ ఎపిసోడ్ నడుస్తూ ఉండగా… తెల్లవారేలోగా.. ఒక ఆర్డినెన్స్ తెచ్చేసిన హడావుడి వైఖరిపై దాసోజు శ్రవణ్ తన సన్నిహితులతో మండిపడుతున్నారుట. ఇది చీకటి ఆర్డినెన్స్ అని దీనికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని.. పీసీసీ నాయకులందరితోనూ చెబుతున్నట్లుగా సమాచారం.
అలాగే ఆర్డినెన్స్ అయినంత మాత్రాన తప్పు తప్పే అని.. దానినైనా సరే న్యాయపరంగా అడ్డుకుని తీరుతానని కూడా శ్రవణ్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం. బహుశా శుక్రవారం లేదా సోమవారం నాటికి శ్రవణ్ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కూడా మరో పిటిషన్ వేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆర్డినెన్స్‌ను న్యాయపరంగా అడ్డుకోడానికి చాలా చిక్కులున్నాయని.. అందువల్లనే కేసీఆర్.. ఈ ఎత్తుగడకు వెళ్లిందనే వాదన కూడా వినిపిస్తోంది.