సినిమాకి అర్థమే మారిపోతోంది. ఇది వరకు మూడు గంటలూ, నాలుగ్గంటలూ నడిచే సినిమాలు వచ్చేవి. ఆ తరవాత.. రెండు గంటలకు సినిమా పరిమితమైపోయింది. సినిమా నిడివి రెండున్నర గంటలు అంటే.. `వామ్మో` అంటున్నారు జనాలు. ఏటీటీలు మొదలయ్యాక.. రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లు 20 నిమిషాల ఫుటేజ్ తీసి – దాన్ని కూడా సినిమా అనేస్తున్నారు.
ఇప్పుడు 10 నిమిషాల సినిమాలూ మొదలవ్వబోతున్నాయి. `స్నాక్ మూవీస్` పేరుతో శ్రేయాస్ మీడియా ఈ ప్రయోగం చేయబోతోంది. స్నాక్ మూవీస్ అంటే.. స్నాక్స్ తినేలోపు.. సినిమా పూర్తయిపోతుందన్నమాట. ఇదీ వీళ్ల కాన్సెప్ట్. చిన్న చిన్న కథల్ని పది నిమిషాల సినిమాలు (షార్ట్ ఫిల్మ్స్) గా మలచి.. ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. దాని వల్ల.. సాహిత్యంలో ఉన్న చాలా కథలకు దృశ్య రూపం కల్పించినట్టు అవుతుంది, ప్రతిభావంతులకు అవకాశాలు ఇచ్చినట్టూ ఉంటుంది. ఇదీ.. శ్రేయాస్ ప్లానింగ్. కొన్ని కథలైతే… పెద్ద పెద్ద దర్శకులకు అప్పగించి, వాటిని సినిమాలుగా తీయబోతున్నార్ట. శ్రీరమణ రాసిన కొన్ని మంచి కథల హక్కుల్ని శ్రీయాస్ మీడియా సంపాదించింది. తనికెళ్ల భరణి తీసిన `మిథునం` కథా రచయిత శ్రీరమణే. ఆయన రాసిన `బంగారు మురుగు` లాంటి కథల్ని స్నాక్ మూవీస్ గా తీయబోతోంది శ్రీయాస్.