తెలుగు సినిమా మారలేదు. ముఖ్యంగా బడా కమర్షియల్ సినిమాల తీతలో అదే మూస ధోరణి అవలంభిస్తున్నారు సినిమా రూపకర్తలు. హీరో ఎంట్రీ అనుకోండి.. ఏదో షూ కంపెనీ యాడ్ తీసినట్లు మొదట హీరో బూట్లో , చెప్పులో చూపిస్తారు. ఇంక బాడీ లో హీరోయిజం ఎక్కడా లేనట్లు ఆ బూట్లోతోనే హీరోయిజం ఎలివేట్ అవుతుందనే నమ్మకం బలంగా వుండిపోయింది దర్శకుల్లో. ప్రేక్షకులు ఇదే మహా ప్రసాదం అని సర్దుకుపోయే పరిస్థితి. పాటల చిత్రీకరణలో ఇదే మూస ధోరణి. సినిమా ఓ మూడ్ లో నడుస్తుంటుంది. అప్పటి వరకూ ఏవో ఎమోషన్స్ రన్ అవుతుంటాయి. హీరో ఏవో సవాళ్ళతో ఇబ్బంది పడుతుంటాడు. ఇక్కడ కాస్త రిలాక్స్ అవ్వడానికి హీరోయిన్ తో ఓ సీన్ చూపిస్తారు. కట్ చేస్తే.. యూరప్ లోనో ఇటలీ లోనో డ్యాన్సలు వేస్తూ కనిపిస్తారు. అప్పటివరకూ ఒక క్యారెక్టర్ లో కనిపించే హీరో హీరోయిన్స్ ఇక్కడ మరో రకంగా కనిపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ ను అయితే మరీ విచ్చలవిడిగా చూపించే కార్యక్రమం పెట్టుకుంటారు. ఏవేవో డ్రెస్ లు వేయించి, ఇంకేవో డ్యాన్సలు కట్టిస్తారు. నిన్న వచ్చిన ”కాటమరాయుడు” వరకూ ఇదే ధోరణి. అయితే ఈ సినిమాలో మాత్రం ఆ విచ్చలవిడి తనం మరీ పెరిగిపోయింది. ఈ సినిమా కోసం ఫారిన్ లో రెండు పాటలు షూట్ చేశారు. ఈ పాటల్లో హీరోయిన్ శ్రుతి హాసన్ ను చూసి షాక్ అయిపోయారు కొందరు. అసలు ఇది పవన్ కళ్యాణ్ సినిమానా, ఆ హీరోయిన్ పక్కన డ్యాన్స్ చేస్తుంది పవన్ కళ్యాణా ?అనే సందేహాలు రాక మానవు.
సినిమాని సినిమా గా చూడాలి. ఇంలాటి లాజిక్ లు వెదక్కూడదు, ద్రుష్టి దోషం అనవచ్చు. ఎన్ని కోణాల్లో అలోచించినా.. హీరోయిన్ ను బారు డ్యాన్సర్ కంటే దారుణంగా చూపించిన క్రెడిట్ కాటమరాయుడు యూనిట్ తీసుకోకతప్పదు. అసలు ఆ పాటల్లో శ్రుతి హాసన్ ను అంత దారుణంగా చూపించాల్సిన అవసరం ఏముందో అర్ధం కాదు. స్క్రిప్ట్ ప్రకారం తీసుకున్నా.. ఒక జడ్జ్ కూతురు అవంతి(శ్రుతి హాసన్) క్లాసికల్ సింగర్. సినిమా మొత్తం నిండైనా వస్త్రదారణలో కనిపిస్తుంది. అలాంటి పాత్రకు పాటల కోసం బార్ డ్యాన్సర్ కంటే దారుణమైన వస్త్రధారణ చేయించాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై వుంటే చాలు అనే నమ్మకం దర్శకులది. అలాంటప్పుడు హీరోయిన్ ను గ్లామర్ పేరుతో మరీ ఇంత విచ్చలవిడిగా చూపించాల్సిన అవసరం ఏముంది.? బహుశా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఒక హీరోయిన్ డ్రెసింగ్ ఇంత ఘోరంగా వున్న సినిమా ఇదేనేమో.
శ్రుతి హాసన్ ఎక్స్ పోజింగ్ కు అడ్డు చెప్పదు. అలాగని వీళ్ళ సెన్స్ ఏమైయింది. ఫారిన్ వెళ్ళే సరికి సినిమా స్క్రిప్ట్ మర్చిపోయి.. పాటలు తీశారా? దర్శకుడు డాలీ కి మంచి టేస్ట్ వున్న టెక్నిషియన్ గా పేరుంది. కాటమరాయడులో ఈ రెండు పాటలు చూసక ఆయన పై అభిప్రాయం మారిపోతుంది. హీరోయిన్ ను గ్లామర్ గా చూపించడంలో తప్పలేదు. అయితే కాటమరాయడులో ఆ రెండు పాటల విషయానికి వస్తే.. గ్లామర్ కాస్త వల్గర్ పై టర్న్ తీసుకుంది. ఇది వరకూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బోలెడు పాటలను ఫారిన్ లో షూట్ చేశారు. గబ్బర్ సింగర్ లో ”పిల్లా నీవు లేని జీవితం’, అత్తారింటికిలో ”బాపు గారి బొమ్మ’.. ఇలా ఫారిన్ లో తీసినవే. కాటమరాయడు పాటలు కూడా ఇలా తీయడానికి స్కోప్ వుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కూడా అంత పద్దతిగా ఉటుంది . కానీ దర్శక నిర్మాతలకు ఏమనిపించిదో.. హీరోయిన్ ను బార్ డ్యాన్సర్ కంటే దారుణంగా ఆడించారు.