పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శరత్ మరార్ నిర్మాత. బడ్జెట్ పరిమితుల్ని దృష్టిలో ఉంచుకొని నూతన కథానాయితో ఈసినిమాని లాగించేద్దాం అనుకొన్నారు. అయితే పవన్ మాత్రం.. స్టార్ హీరోయినే కావాలని పట్టుబట్టాడు. అందులోనూ శ్రుతిహాసన్ పేరుని ప్రతిపాదించాడట. దాంతో.. శ్రుతి కాల్షీట్ల కోసం ఆరా తీయకతప్పలేదు. ఇప్పుడు శ్రుతిహాసన్‌నే ఖాయం చేసేశారు. ”మా సినిమాలో శ్రుతిహాసన్ నటిస్తోంది” అంటూ చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించేసింది. అలా.. గబ్బర్‌సింగ్ కాంబినేషన్ మళ్లీ సెట్టయ్యిందన్నమాట.
వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇదో ఫ్యాక్షనిస్టు ప్రేమకథ అని చిత్రబృందం తెలిపింది. ఓ తమిళ చిత్రానికి రీమేక్ అన్న ప్రచారం జరుగుతున్నా… అదేం కాదని, ఇది కొత్త కథే అని చిత్రబృందం చెబుతోంది. ఆకుల శివ కథా మాటలు సమకూరుస్తున్నారు. అనూఫ్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.