వెండి తెరపైనే కాదు.. స్టేజీలపై ఆట పాటలతో దుమ్ము రేగ్గొట్టడం మన కథానాయికలకు అలవాటే. సంతోషం, మా, ఫిల్మ్ ఫేర్, సైమా… ఇలా ఎప్పుడూ ఏదో ఓ అవార్డు కార్యక్రమం వస్తుంటుంది. వాటిలో కథానాయికలు ఆడి పాడి.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటుంటారు. ఈ మధ్య ఈ ట్రెండ్ మరింత ఎక్కువవుతోంది. స్టేజీలపై ఆడి పాడేవాళ్లకు డిమాండ్ ఎంతగా పెరిగిందంటే.. ఫేడవుట్ అయిపోతున్న హీరోయిన్లకు సైతం మంచి డబ్బులు గిట్టుబాటు అవుతున్నాయి. ఈనెల 13, 14 తేదీలలో దుబాయ్‌లో `సైమా` అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ స్టార్స్ చాలామంది పాల్గొన్నారు. వాళ్లకు మంచి పారితోషికాలు కూడా అందాయి. అయితే శ్రుతిహాసన్, కాజల్, రకుల్ లాంటి వాళ్లు కనిపించలేదు. కాజల్‌కి అవార్డు వచ్చినా అందుకోలేదు. ఈ ముగ్గురు భామలూ ఈ కార్యక్రమానికి రావాల్సిందే. కానీ `రేట్లు` గిట్టుబాటు కాకపోవడంతో… ఈ షోలో కనిపించలేదు.
శ్రుతిహాసన్.. స్టేజీపై 15 నిమిషాలు గడపడానికి ఏకంగా రూ.60 లక్షలు డిమాండ్ చేసిందని సమాచారం. ఆరు పాటలతో కూడిన మెడ్లీ కి డాన్స్ చేయడంతో పాటు, కొన్ని పాటల్ని స్వయంగా ఆలపించడానికి ఈ మొత్తం డిమాండ్ చేసిందట. అడిగినంత ఇవ్వడానికి నిర్వాహకులు కూడా సై అన్నారు. కానీ ఎందుకో చివరి నిమిషంలో ఈ కాంట్రాక్ట్ వదులుకుంది శ్రుతి. రకుల్ కూడా భారీగా డిమాండ్ చేసిందట. కనీసం రూ.40 లక్షలు ఇస్తే గానీ రానని చెప్పేసిందట. కాజల్ రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. నెలకు ఇలాంటి పోగ్రాములు ఒకట్రెండు బుక్ చేసుకుంటే చాలు. సినిమాల్లేకపోయినా… హాయిగా గడిపేయొచ్చు.