ప్రఖ్యాత సినీ దర్శకుడు శ్యాం బెనెగల్ వెళ్ళిపోయారు. ఆయన సినిమాలానే పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, చివరివరకూ సినిమానే శ్వాసించి బ్రతికిన ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ శ్యాం బెనెగల్. ఏ రంగంలోనైన తమకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసుకుంటే పదికాలాలు నిలబడిపోవచ్చనే మాటకు నిలువెత్తు నిదర్శనం బెనెగల్.
శ్యాం బెనెగల్ హైదరాబాద్ లో పుట్టారు. ఆయన పూర్వీకులకు కర్ణాటక మూలాలు వున్నాయి. ఆయనకు సినీ నేపధ్యం వుంది. లెజండరీ డైరెక్టర్, యాక్టర్ గురుదత్ శ్యాం బెనెగల్ కజిన్. అయితే గురుదత్ అభిమాని కాదాయన. బెనెగల్ కి సత్యజిత్ రాయ్ ఇష్టం. కానీ ఆయన సినిమాల ప్రభావం బెనగల్ పై పడలేదు. గురుదత్, సత్యజిత్ రాయ్ స్టయిల్ కాకుండా తనకంటూ ఒక పంధాని సృష్టించుకున్నారు. ఇక్కడే సమాంతర సినిమాని తెరపైకి తీసుకొచ్చారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమాంతర సినిమాని పెంచి పోషించి దానికో వైభవం తెచ్చిన దర్శకుల్లో అగ్రగణ్యుడు బెనగల్. భారతీయ చిత్ర రంగంలో సమాంతర సినిమాకి శ్రీకారం చుట్టి, ఎన్నో ఆణిముత్యాలను అందించిన దిగ్దర్శకుడు బెనెగల్. సినిమా పరిశ్రమలో బెనెగల్ ఒక వ్యవస్థ. కథని మనసుని హత్తుకునేలా చెప్పడంలో ఆయన శైలి ఎంతో ప్రత్యేకం. పాత్ర, నటన, సంగీతం, కెమరా, ఆర్ట్ వర్క్.. ఇలా సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ లో బెనెగల్ మార్క్ కనిపిస్తుంది. ఒక సీన్ చూసి అది బెనెగల్ సినిమాని చెప్పొచ్చు. అంతలా వెండితెరపై తన ముద్రని వేశాడు.
బెనెగల్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేయడంలో ఆయన సిద్దహస్తుడు. ఫాంటసీలు కాకుండా సమాజాన్ని అద్దం పట్టే చిత్రాలు నిర్మించాడు. సమాజంలో విభిన్న వర్గాల ప్రజల కథలని చెప్పాడు. ఎంతో మంది మేటి నటులని తీర్చుదిద్దాడు. నసీరుద్దీన్ షా, సాధు మెహర్, ఓంపురి, అమ్రిష్ పురి, అనంత్‌నాగ్, గిరీశ్ కర్నాడ్, షబానా అజ్మీ, స్మితాపాటిల్, ప్రియా తెందూల్కర్, పల్లవిజోషి, సులభాదేశ్ పాండే ఇలా ఎందరో ఆయన సినిమాల నుంచే స్టార్స్ గా మెరిశారు. స్త్రీ పాత్రలని హుందాగా తీర్చిదిద్దడంలో ఆయనది ప్రత్యేక శైలి.
బెనెగల్ సినిమా అంటే అవార్డులు పంట. సినిమాకి అవార్డు వస్తుందా? అని అడక్కూడదు. బెనెగల్ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చాయని అడగాలి. ఆయన సినిమా అవార్డులు కొల్లగొట్టడం ఓ రివాజు. ఓ నాలుగు సినిమాలు తప్పితే ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలకు కుప్పలు తెప్పలుగా అవార్డులు వచ్చాయి.
దేశంలో మొదటి క్రౌడ్ ఫండింగ్ సినిమా(మంథన్ ) తీసింది కూడా ఆయనే. జవహర్లాల్ నెహ్రూ ‘ది డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకం ఆధారంగా బెనగల్ తీసిన ‘భారత్ ఏక్ ఖోజ్’ టీవీ సిరిస్ 5,000 సంవత్సరాల భారత చరిత్రని విజువలైజ్ చేస్తుంది. ఇండియన్ హిస్టరీపై ఆసక్తి గలవారు తప్పక చూడాల్సిన టీవీ ప్రోగ్రామ్ ఇది. హైదరాబాద్ పుట్టిన శ్యామ్‌బెనెగల్.. తెలంగాణ ప్రాంతం తాలూకు సామాజిక జీవనానికి అద్దం పట్టేకొన్ని సినిమాలు తీశారు. ‘అంకుర్’, ‘నిశాంత్’, సుశ్మన్, మండీ చిత్రాల్లో తెలంగాణా ఇతివృత్తాలు కనిపిస్తాయి.
ఆయన అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు వరించాయి. భారతీయ సినిమా డైరెక్షన్ ని మార్చిన డైరెక్టర్ గా శ్యామ్‌బెనెగల్ చిరస్మరణీయుడు. ఇండియన్ సినిమా ఉన్నంత కాలం… ఆయన పేరు గుర్తుండిపోతుంది.