యాంకర్ శ్యామల! ఏపీ ఎన్నికలకు ముందు ఈ పేరు కాస్త గట్టిగానే వినిపించింది. తను వైకాపా సపోర్టర్. పార్టీ మీద అభిమానంతో ప్రచారం చేసింది. కాకపోతే – సింహం .. తోడేలు కథ చెప్పి, ఓవర్గాన్ని ఉడికించింది. ఇంటర్వ్యూలలో రాజకీయ ఉద్ధండురాలిలా మాట్లాడింది. పవన్ జనాల కోసం ఏం చేయలేదని ఎద్దేవా చేసింది. పిఠాపురం నుంచి ఓడిపోతున్నాడని జోస్యం చెప్పింది. వై నాట్ 175 అంటూ.. జగన్ పాడిన పాటే పాడింది. అయితే ఎలక్షన్ రిజల్ట్ తరవాత శ్యామల మళ్లీ కనిపించలేదు. వైకాపా ఘోర పరాభవం అందరిలానే ఆమెనూ అజ్ఞాతంలోకి నెట్టేసింది. దానికితోడు బుల్లి తెరపై అవకాశాల్ని కోల్పోయింది. కొన్ని టీవీ ఛానళ్లు ఆమె అడక్కుండానే వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేశాయి. శ్యామల మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందా? అంటూ కూటమి అభిమానులు ఎదురుచూస్తూ కూర్చున్నారు.
ఎట్టకేలకు శ్యామల బయటకు వచ్చింది. ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. వైకాపా ఎందుకు ఓడిపోయిందో తనదైన విశ్లేషణ ఇచ్చింది. ప్రజలకు సంక్షేమం ఒక్కటే సరిపోదని తేలిందని, అభివృద్ది కూడా కావాలనుకొన్నారని, అందుకే తమ పార్టీ ఓడిపోయిందని నిజాయతీగానే చెప్పుకొంది. చేసిన తప్పుల్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉందని చెప్పుకొచ్చింది. తాను ప్రచారం చేసిన ప్రతీ చోటా.. వైకాపా గాలి కనిపించిందని, అయితే అది ఓట్ల రూపంలో తర్జుమా అవ్వలేదని విశ్లేషించింది. అంతేకానీ, మిగిలిన నాయకుల్లా ఏవీఎం మిషన్ల ట్యాంపరింగ్ జరిగిందని దొంగ ఏడుపులు ఏడవలేదు. శ్యామలకు రాజకీయ అనుభవం చాలా తక్కువ. అయితేనేం జరిగిన తప్పు ఒప్పుకొంటూ, ప్రజా తీర్పుని గౌరవించింది. ఈమాత్రం బుద్ధి మిగిలిన వైకాపా పెద్దలకు లేకపోయింది.
కొన్ని టీవీ ఛానళ్లు పక్కన పెట్టారన్న విషయాన్ని శ్యామల కూడా ఒప్పుకొంది. ”నేనెక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తుంటాను. సినిమాల్లో ఓ ఫ్యామిలీ ఆధిపత్యం ఎక్కువ. వాళ్లు నన్ను పక్కన పెడతారా, లేదా అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలేం ఇటీవల జరగలేదు. కాబట్టి వాళ్ల స్పందన గురించి ఇప్పుడే చెప్పలేను” అంటూ పరోక్షంగా మెగా ఫ్యామిలీ గురించి ప్రస్తావించింది.
మొత్తానికి శ్యామల తిరిగి తెరపైకి రాగలిగింది. కాకపోతే.. ఇదివరకటిలా తన దూకుడు చూపిస్తుందా, లేదంటే పార్టీ ఎలాగూ అధికారంలో లేదు కాబట్టి సైలెంట్ అయిపోతుందా? అనేది కాలమే చెప్పాలి.