తెలంగాణలో పోలీసు అధికారుల ఆకస్మిక మరణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో ఓ ఎస్సై తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దానికి ఓ అమ్మాయి కారణంగా తేలింది. ఇప్పుడు కామారెడ్డి జిల్లా భిక్కనూరు ఎస్ఐ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ కూడా చెరువులో దూకి చనిపోయారు. వీరితో పాటు మరో కంప్యూటర్ ఆపరేటర్ కూడా చెరువులో దూకడంతో ఏదో జరిగిందని అర్థమవుతోంది.
భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ , మహిళా కానిస్టేబుల్ శృతితో పాటు నిఖిల్ అనే కంప్యూటర్ ఆపరేటర్ మధ్య వ్యక్తిగత అంశాల మధ్య వివాదం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ముగ్గురూ చెరువులో దూకి చనిపోయారు. చెరువు గట్టు మీద వారి వస్తువులు ఉండటంతో చెరువులో గాలించారు. ఎస్ఐ మృతదేహం ఆలస్యంగా దొరికింది. దీంతో ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.
ఈ ముగ్గురి ఆత్మహత్యకు కారణం ఏమిటో ఆరా తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారి ఫోన్ రికార్డులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలు, ప్రేమ వంటి కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పోలీసు ఉద్యోగం చేస్తూ కఠినంగా ఉండాల్సిన వారు.. ధైర్యంగా ఉండాల్సిన వారు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం పోలీస్ డిపార్టుమెంట్ లో విషాదాన్ని నింపుతోంది. వరుసగా ఇలా పోలీసు అధికారులు చనిపోవడం ఉన్నతాధికారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.