తెలంగాణ పోలీసు శాఖలో ఒకే రోజు రెండు విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఓ ఎస్ఐ ఆత్మహత్య చేసుకోగా.. మరో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయింది. ఈ రెండింటికి సంబంధం లేదు కానీ. డిపార్టుమెంట్లో మాత్రం కనిపించని అలజడి రేపుతోంది.
జిల్లాలో వాజేడు ఎస్సై హరీశ్ సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత రోజే ఈ ఆత్మహత్య ఘటన జరగడం కలకలం రేపింది. అయితే వివాహానికి సంభందించిన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. చెల్పాక అటవీప్రాంతంలో ఎన్ కౌంటర్ కావడంతో వాహన తనిఖీల్లో బిజీగా ఉన్నారు. ఇదే సమయం లో వరుసకు కోడలు అయ్యే యువతి హరీష్ కోసం పోలీసుస్టేషన్ కు వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది హరీష్ కు ఫోన్ చేయడంతో ఆ యువతిని హరిత ఫెరిడో రిసార్ట్ లో దింపాలని సిబ్బందికి చెప్పారట. దీంతో ఆ యువతి రిసార్ట్ లోని 107 రూం లో దిగింది. హరీష్ సాయంత్రం సమయంలో రిసార్ట్ కు వచ్చారు. అక్కడ జరిగినవాదనతో హరీష్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్నారు.
మరో వైపు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు నుంచి మన్యగుడ రహదారిపై కానిస్టేబుల్ నాగమణి మృతదేహం పడి ఉంది. నాగమణి స్వస్థలం రాయపోలుగా గుర్తించారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న నాగమణిది పరువు హత్యగా అనుమానిస్తున్నారు. నెల రోజుల క్రితం ఇంట్లో వారిరువురూ ఇష్టానికి భిన్నంగా ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కోపంతో కుటుంబసభ్యులే హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.