టాలీవుడ్లో ఇప్పుడు ఖణఖణమంటున్న గొంతు…. సిద్ద్ శ్రీరామ్ది. స్టార్ హీరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా.. అందులో సిద్ద్ పాట ఉండాల్సిందే. లేటెస్ట్ టాలీవుడ్ హిట్స్ అన్నీ సిద్ద్ శ్రీరామ్ సొంతం. గమ్మత్తైన గొంతు, పదాన్ని పలికే తీరులో వైవిధ్యం సిద్ద్ పాటకు ప్రత్యేకతని అలవర్చాయి. గీత గోవిందం, అల వైకుంఠపురం చిత్రాలలో సిద్ద్ పాడిన పాటలు ఆయా చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈమధ్య విడుదలైన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిన్న చిత్రానికి సిద్ద్ శ్రీరామ్ పాట వల్ల బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.
ఈ క్రేజ్‌ని సిద్ద్ కూడా బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం దక్షిణాదిన అత్యంత ఖరీదైన గాయకుడు తనే. ఒక్కో పాటకూ 5 లక్షల వరకూ పారితోషికం అందుకుంటున్నాడు. నిజానికి గాయనీగాయకులకు పారితోషికాలు చాలా తక్కువ. పాపులర్ సింగర్స్‌కి రూ.1 లక్ష నుంచి 1.5 లక్షల వరకూ ఉంటుంది. వర్థమాన గాయకులకు పది వేలిచ్చి కూడా పాడించుకుంటారు. అలాంటి చోట సిద్ద్ ఒక్కో పాటకు 5 లక్షలు అందుకోవడం విశేషమే. అయితే… సిద్ద్ శ్రీరామ్ పాడిన పాటలకు యూ ట్యూబ్‌లో మంచి వ్యూస్ వస్తున్నాయి. దానికి తోడు సినిమాకి కావల్సినంత ప్రచారం లభిస్తోంది. దాంతో 5 లక్షలైనా ఫర్వాలేదని నిర్మాతలు ముందుకు వస్తున్నారు. అయితే ఈ జోరు ఎంతకాలం అన్నది చెప్పలేం. ఇలా ఒకట్రెండు పాటలకు స్టార్ డమ్ అందుకుని, ఆ తరవాత కనుమరుగైన గాయకులు ఎంతో మంది ఉన్నారు. మరి.. సిద్ద్ శ్రీరామ్ ఈ స్టార్‌డమ్‌ని ఎంత కాలం కొనసాగిస్తాడో చూడాలి.