కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యను మార్చే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇటీవల కాలంలో ఆయన అనేక వివాదాలలో చిక్కుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెస్తున్నందున ఆయనను తొలగించి ఆ స్థానంలో ఎంపి మరియు లోక్ సభలో పార్టీ నాయకుడిగా వ్యవహరిస్తున్న కర్నాటకకు చెందిన మల్లికార్జున ఖర్గేని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్యనే ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు పరమేశ్వర్ ని డిల్లీ పిలిపించుకొని పరిస్థితుల గురించి తెలుసుకొంది. దక్షిణాది రాష్ట్రాలలో ప్రస్తుతం కేరళ, కర్నాటకలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మే 16న జరుగబోయే ఎన్నికలలో ఈసారి వామపక్ష కూటమి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇంక కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉంటుంది.
ఇటీవలే భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా యెడ్యూరప్ప నియమింపబడ్డారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో మళ్ళీ భాజపాని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే ఆయనకి ఆ పదవి కట్టబెట్టింది. ‘వచ్చే ఎన్నికలలో భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధిని నేనే’ అని అప్పుడే ఆయన ప్రకటించేసుకొన్నారు కూడా. కనుక ఇకనుంచి ఆయన ఆ పని మీదే ఉంటారని వేరే చెప్పనవసరంలేదు.
ఇటీవల భాజపా అడ్డుదారిలో అధికారం దక్కించుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. అందుకు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. కనుక అధికార దాహంతో పరితపిస్తున్న భాజపా ఎడ్యూరప్ప కలిసి సిద్దరామయ్య ప్రభుత్వానికి కూడా ఎసరు పెట్టే ప్రయత్నాలు చేయవచ్చు. అదే కనుక జరిగితే సిద్దరామయ్య వారిని అడ్డుకోలేరు. అప్పుడు అతి కష్టపడి సంపాదించుకొన్న కర్నాటక రాష్ట్రం కూడా కాంగ్రెస్ పార్టీ చేజారిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకొంటూ, ఎడ్యూరప్ప ప్రయత్నాలని అడ్డుకొంటూ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ గెలిపించుకోవడానికి ఆ రాష్ట్రానికి ఒక బలమయిన ముఖ్యమంత్రి అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం అందుకు మల్లికార్జున ఖర్గే అన్ని విధాల అర్హుడని భావిస్తోంది. కనుక ముఖ్యమంత్రి మార్పుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చునని సమాచారం.