విజయవాడలో నిన్న జరిగిన భాజపా కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ సిద్దార్థనాథ్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో అనకాపల్లిలో ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసాయి.
ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్ కనిశెట్టి సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనే సంగతి తెలిసి ఉంటే, ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో ఎందుకు హామీ ఇచ్చారు? ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీని ఒప్పించిన ఘనత మాదేనని ఎందుకు గొప్పలు చెప్పుకొన్నారు? మీరే అధికారంలోకి వచ్చిన తరువాత కుంటిసాకులు చెప్పి ఇవ్వకుండా ఎందుకు తప్పించుకొంటున్నారు? ప్రజలను మోసం చేసిన భాజపా నేతలు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ప్రజలలోకి వస్తారు? గతంలో 11 రాష్ట్రాలకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండా హోదా ఇచ్చినప్పుడు, ఏపికి ఇవ్వడానికి కుంటిసాకులు ఎందుకు చెపుతున్నారు?అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకు మా పోరాటం కొనసాగుతుంది. భాజపాని, మోడీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఒకవేళ ఇవ్వకుండా మోసం చేస్తే గత ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఏవిధంగా బుద్ధి చెప్పారో భాజపాకి కూడా అదేవిధంగా బుద్ధి చెపుతారని కనిశెట్టి సురేష్ బాబు హెచ్చరించారు.
ఈ అంశంపై తెదేపా కూడా ప్రతిపక్షాలతో గొంతుకలిపి కేంద్రంపై విమర్శలు గుప్పిస్తోంది కానీ ఇంతవరకు ఎన్నడూ ప్రత్యక్షంగా ప్రజలలోకి వచ్చి ఉద్యమించలేదు కానీ ప్రజాసంఘాలు ఉద్యమిస్తే అభ్యంతరం చెప్పలేదు. జగన్ ని విమర్శించినట్లు వాటిని ఎన్నడూ విమర్శించలేదు. ప్రజా సంఘాలు కూడా కేంద్రాన్ని, భాజపానే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి తప్ప జగన్ లాగ తెదేపాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని పెద్దగా విమర్శించడం లేదు. కనుక వాటికి తెదేపా పరోక్షంగా మద్దతు ఉన్నట్లే భావించవచ్చు. ప్రత్యేక హోదా కోసం అవి చేస్తున్న ఉద్యమాల వలన చంద్రబాబు నాయుడు చేతికి మట్టి అంటదు కనుక కేంద్రాన్ని, రాష్ట్ర భాజపాని ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి వాటికి వెనుక నుంచి ప్రోత్సహిస్తున్నా ఆశ్చర్యం లేదు.