సిద్దార్థ్ – అతిథిరావు హైదరీ పెళ్లి చేసేసుకొన్నారు. వారి ప్రేమ బంధం.. పెళ్లితో బలపడింది. వీరిద్దరూ ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి స్వీట్ షాక్ ఇస్తారని అనుకొంటూనే ఉన్నారు. అదే నిజం చేశారు. అయితే…. ఈ పెళ్లి అత్యంత రహస్యంగా, సినిమాటిక్ పద్ధతిలో సాగిన పద్ధతే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాయకస్వామి ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. అక్కడే ఎందుకంటే.. అతిథిరావుది వనపర్తి సంస్థానమే. రంగనాయకస్వామి ఆలయం వాళ్ల పూర్వీకులు కట్టించింది. అక్కడ పెళ్లి చేసుకొంటే అంతా శుభమే జరుగుతుందని అతిథిరావు భావించింది. పెళ్లి తంతు సింపుల్ గా సాగినా, అక్కడ చాలా డ్రామా నడిచింది.
తొలుత అక్కడ క్యార్ వ్యాన్లు చేరుకొన్నాయి. కెమెరాలు దిగాయి. అక్కడేదో షూటింగ్ జరుగుతోందన్న భ్రమ కల్పించి, ఆ ఆలయాన్ని ఆధీనంలోకి తెచ్చుకొన్నారు. ఆలయంలో నిత్యం పూజలు చేసే పూజారులకు సైతం లోపలకు అనుమతి లభించలేదు. ఈ పెళ్లి తంతు కూడా చెన్నై నుంచి పిలిపించుకొన్న పూజారులే పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఈ కార్యక్రమం పది గంటలకల్లా పూర్తయ్యింది. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే ఈ పెళ్లి తంతులో పాల్గొన్నారు. సాయింత్రం అదే ఊర్లో చిన్న విందు కూడా ఏర్పాటు చేసింది కొత్త జంట.