సకుటుంబ సపరివార సమేతంగా మా సినిమా చూడండి – అంటూ డప్పు కొంటుంటారు సినిమా వాళ్లు. అందరూ చూసే ఎలిమెంట్స్మా సినిమాలో ఉన్నాయి అని చెప్పుకోవడం, అన్ని వర్గాల ప్రేక్షకులూ టికెట్ కొనాలని ఆరాటపడడం తప్పేం కాదు. అయితే ”మా సినిమా అందరూ చూసేది కాదు… ఓ వర్గం మాత్రమే పరిమితం.. పిల్లలకు చూపిద్దామనుకొంటే నేను ఒప్పుకోను” అంటూ డిఫెరెంట్‌గా ప్రచారం చేస్తున్నాడు సిద్దార్థ్. తను కథానాయకుడిగా నటించి, నిర్మించిన సినిమా ‘గృహం’. ఈ శుక్రవారం విడుదల అవుతోంది. ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, థ్రిల్లర్స్ చేసిన సిద్దార్థ్ తొలిసారి ఓ హారర్ సినిమాలో నటించడం విశేషం. దానికి తగ్గట్టుగా ప్రచారాన్ని కూడా కొత్తగానే చేస్తున్నాడు. ”ఇది హారర్ సినిమా. చిన్న పిల్లలు, గుండె దడ ఉన్నవాళ్లూ చూడ్దొద్దు. ఈ సినిమాలో ఓ పాప నటించింది. తాను ఈ సినిమా చూస్తానన్నా నేను ఒప్పుకోలేదు. సెన్సార్ వాళ్లని ఏ సర్టిఫికెట్ ఇవ్వమని బతిమాలాను. ఈ సినిమా అందరూ చూడాలని ఆశపడడం లేదు. ఓ వర్గం చూస్తే చాలు” అంటున్నాడు సిద్దార్థ్.
ఈమధ్య ఈ హీరో దూకుడు బాగా తగ్గింది. తన అలికిడే లేకుండా పోయింది. సిద్దార్థ్ పని అయిపోయిందనుకొంటున్న తరుణంలో ఈ సినిమాతో ముందుకొస్తున్నాడు. తమిళంలో ఈ సినిమా ఇప్పటికే విడుదలై మంచి ఫలితాన్ని సాధించింది. తెలుగులోనూ అదే రిజల్ట్ ఆశిస్తున్నాడు సిద్దూ. ”నేను పడిపోయాను, ఓడిపోయాను, నా పని అయిపోయింది అనడంలో ఎలాంటి నిజం లేదు. ఈమధ్య నా నుంచి మంచి సినిమా రాలేదంతే. గృహం అనే ఓ మంచి సినిమాతో మరోసారి మీ దగ్గరకు వచ్చా. ఈసారి చెత్త సినిమా తీస్తే.. చెప్పుతో కొట్టండి” అంటూ ఆవేశ పడిపోయాడు సిద్దూ.