హారర్ సినిమా అంటే ఎప్పటికీ ఆసక్తే. ఈ సినిమాల కోసం ఎదురు చూసే ఓ వర్గం ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. హారర్ కామెడీ అంటూ మరో జోనర్ మొదలైంది. ఆ జోనర్లో వంద సినిమాలైనా వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు రొమాంటిక్ హారర్ అనే మరో జోనర్ కూడా మొదలయ్యిందేమో అనే అనుమానం కలుగుతోంది. ‘గృహం’ సినిమా చూస్తుంటే. సిద్దార్థ్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన సినిమా ‘గృహం’. తమిళంలో ఇప్పటికే విడుదలైంది. వసూళ్లు బాగున్నాయి. రేటింగులూ బాగానే వచ్చాయి. ఈ శుక్రవారం తెలుగులో ‘గృహం’ విడుదల అవుతోంది. బుధవారమే ప్రెస్ కోసం ప్రివ్యూలు వేసేశారు. హారర్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నా, దానికి తగ్గట్టు రొమాంటిక్ సీన్లు ఈ సినిమాలో మేళవించారు. సిద్దార్థ్ రొమాంటిక్ బోయ్ కదా, అందుకే తన ఇమేజ్‌కి తగ్గట్టు ఆయా సీన్లు పొందుపరిచినట్టు అనిపిస్తుంది. ఆండ్రియాతో లిప్ లాక్‌లు, బెడ్రూమ్ సన్నివేశాలూ చూస్తే.. ‘ఏ’ సర్టిఫికెట్ హారర్ ఎలిమెంట్స్ కోసం కాదు, ఈ రొమాన్స్ కోసం ఇచ్చుంటారేమో అనిపించింది. ఓ హారర్ సినిమాలో ఇన్ని లిప్ లాక్‌లు చూడడం ఇదే తొలిసారేమో. హారర్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉండడంతో, మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా వర్కవుట్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. కాకపోతే… పంటికింద రాయిలా, ఆ మితిమీరిన రొమాన్స్ ఒకటి. కుర్రాళ్లకు పండగే ఇక.