తొలి సినిమా విడుదల కాకముందే సుకుమార్ దృష్టిలో పడిన దర్శకుడు వి.యశస్వీ. సుకుమార్ బ్యానర్లో ఈ యువ దర్శకుడి సినిమా ఓకే అయ్యింది. దాంతో.. యశస్వీ ఎవరు? ఆయన తీసిన సినిమా ఏమిటి? అనే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు యశస్వీ సినిమా ‘సిద్దార్థ్ రాయ్’ ట్రైలర్ బయటకు వచ్చింది. సుకుమార్ సినిమాల్లో హీరోలానే ‘లాజిక్కు’లతో బతికేసే క్యారెక్టరైజేషన్‌తో సిద్దార్థ్ రాయ్ ని దర్శకుడు మలిచాడన్న విషయం ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. బహుశా… దానికే సుకుమార్ పడిపోయి, సెకండ్ సినిమా ఛాన్స్ ఇచ్చి ఉంటాడు.
‘అతడు’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ట్రైలర్ చాలా బోల్డ్ గా కట్ చేశారు. ముద్దులూ, రొమాంటిక్ సన్నివేశాలతో నింపేశారు. ఎమోషన్ కూడా బాగానే వర్కవుట్ చేసినట్టు అనిపిస్తోంది. మనిషిని ఎమోషన్స్ కంటే లాజిక్సే ముఖ్యమని భావించిన హీరోకి ఎమోషన్స్ వస్తే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కాన్సెప్ట్. పాయింట్ అయితే సుకుమార్ స్టైల్ లో ఉంది. తీత మాత్రం సందీప్ రెడ్డి ఫార్ములాని అనుసరించాడు దర్శకుడు. సందీప్‌రెడ్డి వంగా తీసిన ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ప్రభావం ఈ సినిమాపై గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా యూత్‌ని టార్గెట్ చేసే సీన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇదంతా ట్రైలర్ కట్ వరకేనా? సినిమాలోనూ ఏమైనా విషయం ఉందా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. రధన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. శ్యామ్ కె.నాయుడు, చిన్నా, ప్రవీణ్ పూడి.. ఇలా సాంకేతిక విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది.