ఓ పాట హిట్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. ట్యూన్ బాగుండాలి. గాత్రం వినసొంపుగా ఉండాలి. ముఖ్యంగా భావం అర్థవంతంగా అనిపించాలి. అన్నింటికి మించి తెరపై చిత్రీకరించిన విధానం, ఆ సందర్భం కుదరాలి. అన్నీ ఉంటేనే పాట నిలిచిపోతుంది. అయితే ఇవన్నీ ఓ ఎత్తు… `హుక్ స్టెప్స్` ఒక ఎత్తు అనేలా వుంది ప్రస్తుత పరిస్థితి.
ఈమధ్య తమన్ ‘గేమ్ ఛేంజర్’లో పాటల గురించి ప్రస్తావిస్తూ, ఆ పాటల్లో హుక్ స్టెప్స్ ఉంటే బాగుండేది, పాటలు హిట్టయ్యేవి అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈరోజు ‘జాక్’ ప్రెస్ మీట్ జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ప్రశ్నే ఎదురైంది. హుక్ స్టెప్పులు ఉంటేనే పాటలు హిట్టవుతాయా? అని అడిగితే ఆయన ‘అవును..’ అనే సమాధానం ఇచ్చారు. దాంతో టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. హుక్ స్టెప్పుల పై ఆధారపడి పాటలు కంపోజ్ చేస్తే, ఇక సంగీత దర్శకుడు ఎందుకూ..? అంటూ తమన్‌ని ట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఓ పాటకు మంచి ట్యూన్ సెట్ చేసి, సరైన గాయనీ గాయకులతో పాడించడమే సంగీత దర్శకుడి పని. ఆ విషయంలో ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. అంతే తప్ప, పాటలకు సరైన స్పందన రాకపోతే, ఆ తప్పుని నృత్య దర్శకులపై నెట్టేయడం ఏమిటన్న చర్చ గట్టిగా నడుస్తోంది.
హుక్ స్టెప్పులు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట. ఇది వరకు లేదు. హుక్ స్టెప్పులు లేని రోజుల్లో కూడా పాటలు హిట్టయ్యాయి కదా? మరి వాటి మాటేమిటి? తమన్ వచ్చి దాదాపు 15 ఏళ్లయ్యింది. అప్పటి నుంచీ ఆయన అందిస్తున్న పాటలన్నీ హుక్ స్టెప్పుల వల్లే హిట్ అయ్యాయా? కాదు కదా? మరి ఇప్పుడు వాటిపై ఇంతిలా ఆధారపడడం ఎందుకు? స్టెప్స్ బాగుంటే, ఆ పాటని మళ్లీ మళ్లీ చూస్తారు. అంతగా స్టెప్పులు నచ్చేస్తే రీల్స్ చేసుకొంటారు. అంత వరకూ ఓకే. కానీ స్టెప్పుల వల్లే పాటలు నిలబడతాయని, ఓ మంచి పాట హుక్ స్టెప్పులు లేకపోవడం వల్ల ఫ్లాప్ అవుతుందని అనుకోవడం నిజంగానే చేతకానితనం. మరి తమన్ ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సివచ్చిందో?