సిద్దు జొన్నలగడ్డ – బొమ్మరిల్లు భాస్కర్ ఇద్దరూ కలిసి ‘జాక్’ అనే సినిమా చేశారు. ఈనెల 10న విడుదల కాబోతోంది. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని, సిద్దు క్రియేటీవ్ వర్క్స్ లో బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడని, అది భాస్కర్‌కు నచ్చడం లేదని, ఓ పాట భాస్కర్ లేకుండానే షూట్ చేశారని రకరకాల వార్తలు వచ్చాయి. వీటిపై అటు సిద్దు, ఇటు భాస్కర్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సినిమా అనేది టీమ్ వర్క్ అని, అందరూ సినిమా కోసమే కష్టపడతారని, తమ డిస్కర్షన్ రూమ్‌లోకి వస్తే, అదో వార్ జోన్లా ఉంటుందని, సినిమా కోసం కొట్టుకొంటామని, తిట్టుకొంటామని, అయితే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాక అన్నీ మర్చిపోతామని చెప్పుకొచ్చారు భాస్కర్. సిద్దుకు అన్ని విషయాల్లోనూ అవగాహన వుందని, అది సినిమాకి ప్లస్సే అవుతుందని, ఓ సీన్ సిద్దుని నమ్మి చేతిలో పెట్టేయొచ్చని, మానేటర్ ముందు కూర్చుని ‘యాక్షన్.. కట్’ చెబితే చాలని… సిద్దుని వెనకేసుకొచ్చారు.
సిద్దు కూడా తమ మధ్య గొడవలే లేవని క్లారిటీ ఇచ్చారు. గండిపేటలో ఓ పాట దర్శకుడు లేకుండా షూట్ చేశామని, అయితే ఆ సమయంలో భాస్కర్‌కు ఎడిటింగ్ వర్క్ వుందని, ‘మీరు ఏసీలో వర్క్ చేసుకోండి.. మేం ఎండల్లో కష్టపడతాం’ అని ఇద్దరూ జోక్ చేసుకొన్నామని, భాస్కర్‌కు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా షూట్ ఎలా చేస్తామని సిద్దు జొన్నలగడ్డ కౌంటర్ ఇచ్చాడు. ఈరోజు జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాస్కర్, సిద్దుల మధ్య రాపో బాగానే కనిపించింది. సో… ఇద్దరి మధ్య గొడవలు లేనట్టే. ఉన్నా.. ప్రస్తుతానికి సర్దుమణిగినట్టే అనుకోవాలి.