డీజే టిల్లుతో స్టార్ అయిపోయాడు సిద్దు జొన్నలగడ్డ. ఇప్పుడు తన కాల్షీట్లకు చాలా డిమాండ్ ఉంది. చేతిలో రెండు సినిమాలున్నాయి. కొత్త కథలు వింటున్నాడు. ఈ నేపథ్యంలో పరశురామ్ చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. `ఫ్యామిలీ స్టార్` తరవాత పరశురామ్ మరో సినిమా పట్టాలెక్కించలేదు. అయితే దిల్ రాజు తో ఓ సినిమా చేయాల్సివుంది. ఓ కథ రెడీ చేసి, హీరోలందరికీ చెబుతూ వచ్చాడు. తమిళ హీరో కార్తీతో కూడా ఓ భేటీ వేశాడు. అయితే పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డతో ఓ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు టాక్. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ యేడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది యాక్షన్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. మాస్ అంశాల్ని గట్టిగా మేళవించార్ట. సిద్దు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘గీతా గోవిందం’తో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన పరశురామ్ ‘ఫ్యామిలీ స్టార్’తో డల్ అయ్యాడు. మళ్లీ ట్రాక్‌లోకి రావాలంటే ఈసారి హిట్టు కొట్టాల్సిందే. అందుకే కథ పక్కాగా రెడీ అయ్యాక, దానిపై గట్టిగా నమ్మకం కుదిరాక సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు. సిద్దు కూడా బిజీగానే ఉన్నాడు. ‘జాక్’ పూర్తి కావొచ్చింది. `కోహినూర్` చిత్రానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చాకే… పరశురామ్ కథ మొదలవుతుంది.