టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డకు ‘జాక్’ రూపంలో ఓ డిజాస్టర్ తగిలింది. ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ వాష్ అవుట్. కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఈ ఫ్లాప్ సిద్దు కెరీర్‌కే పెద్ద దెబ్బ. ఈ ఎఫెక్ట్ సిద్దుపై కచ్చితంగా ఉంది. అందుకే చేతుల్లోంచి రూ.100 కోట్ల సినిమా చేజారిపోయింది. సిద్దు జొన్నలగడ్డ కోసం దర్శకుడు పరశురామ్ ఓ కథ రాసుకొన్నాడు. దిల్ రాజు బ్యానర్లో చెప్పాడు కూడా. ‘ఫ్యామిలీస్టార్’ సినిమా ఫలితం ఇవ్వకపోయినా పరశురామ్ తో మరో సినిమా చేయడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఈ బ్యానర్ కోసమే… పరశురామ్ కథలు సిద్ధం చేస్తున్నాడు. ‘జాక్’కి ముందు సిద్దు జొన్నలగడ్డ కోసం ఓ కథ రెడీ చేశాడు. అది దిల్ రాజుకీ నచ్చింది. అయితే బడ్జెట్ అటూ ఇటుగా రూ.100 కోట్లని టాక్. ‘జాక్’ హిట్టయితే ఇంత పెట్టుబడి పెట్టడానికి దిల్ రాజు రెడీగా ఉండేవారేమో. కానీ.. ఈ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి… ఈ ఆలోచన విరమించుకొన్నారు. అయితే బడ్జెట్ తగ్గించాలి, లేదంటే మరో మాస్ హీరోని వెదికి పట్టుకోవాలి.. పరశురామ్ ముందున్న ఆప్షన్లు ఈరెండే.
కానీ పరశురామ్ మీడియం బడ్జెట్ సినిమాలు చేయడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. తనకు మాస్, యాక్షన్ కథలు చెప్పాలని వుంది. పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని, పాన్ ఇండియా రేంజ్‌కి వెళ్లాలని వుంది. అందుకే ఆలస్యం అవుతున్నా, ఎక్కడా తొందర పడడం లేదు. కథలు రెడీ చేసుకొంటున్నాడు. కాకపోతే.. ఈసారి దిల్ రాజు బ్యానర్లో సినిమా ఉంటుందా, లేదా? అనేదే పెద్ద డౌట్. ‘రెంచ్ రాజు’ అనే ఓ కథ పరశురామ్ దగ్గర రెడీగా వుంది. హీరోగా కార్తి అయితే సూట్ అవుతాడట. కార్తిని కలిసి కథ కూడా వినిపించారు. కానీ నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే వుంది.