సిద్దు జొన్నలగడ్డ టైమ్ బాగుంది. చిన్న సినిమాలతో పెద్ద హిట్లు కొడుతున్నాడు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు సిద్దూని స్టార్ బోయ్‌గా మార్చేశాయి. ఇప్పుడు ‘జాక్’ అవతారం ఎత్తాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి కథానాయికగా నటించింది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. ఇప్పుడు టీజర్ వదిలారు.
‘జాక్’ సినిమా మొదలై చాలా కాలమైనా, ఈ సినిమాకు సంబంధించిన ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. హీరో ఏం చేస్తుంటాడు? అతని క్యారెక్టరైజేషన్ ఏమిటి? అనేవి రివీల్ చేయలేదు. ఇప్పుడు ఈ టీజర్‌తో వాటిపై ఓ క్లారిటీ వచ్చేసింది. సిద్దు క్యారెక్టర్ని చాలా టిపికల్ గా తీర్చిదిద్దారు బొమ్మరిల్లు భాస్కర్. `ప్యాబ్లో నిరూడా` అనే ఓ కొత్త సైంటిఫిక్ పదాన్ని ఈ టీజర్లో పరిచయం చేశారు. బహుశా ఈ పదానికీ హీరో క్యారెక్టరైజేషన్‌కీ లింకు ఉండి ఉంటుంది. ‘మీ నాన్నకే తెలియనంత గలీజ్ జాబ్ ఏం చేస్తుంటావ్ నువ్వు’ అనే హీరోయిన్ ప్రశ్నతో.. హీరో క్యారెక్టర్ ని రివీల్ చేశారు. సిద్దు కామెడీ టైమింగ్, నరేష్ ఫస్ట్రేషన్, వైష్ణవి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఈ టీజర్ సరదాగా నడిచిపోయింది. చివర్లో యాక్షన్ టచ్ ఇచ్చారు. మొత్తానికి బొమ్మరిల్లు భాస్కర్ గమ్మత్తైన కథే ఎంచుకొన్నాడన్న సంగతి అర్థమవుతోంది. ‘నాకో లవ్ స్టోరీ ఉంది’ అనే డైలాగ్ తో… హీరోయిన్ పాత్రని ఎప్పటిలా బొమ్మరిల్లు భాస్కర్ టిపికల్ గా డిజైన్ చేశాడన్న నమ్మకం కలుగుతోంది. మొత్తానికి టీజర్ తో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగాడు దర్శకుడు. మిగిలింది.. ట్రైలర్లో తేలాలి.