మెదక్ జిల్లా సిద్దిపేట మునిసిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా సరే వరుసగా విజయాలనే నమోదుచేస్తూ మహోత్సాహంతో ఉన్న తెలంగాణ రాష్ట్రసమితి సిద్ధిపేట మునిసిపాలిటీని కూడా తమ ఖాతాలో వేసుకున్నది. విజయం ఖచ్చితంగా జోష్ ను పెంచేదే అయినప్పటికీ.. తెరాసకు ఈ విజయం పెద్దగా కిక్ ఇవ్వడం లేదని పార్టీ నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా ఉన్న 34 వార్డుల్లో 22 స్థానాలను మాత్రమే తెరాస గెలుచుకోవడం వారికి జీర్ణం కావడం లేదు. హరీష్ రావుకు తిరుగులేని హవా ఉన్నదని భావించే సిద్ధిపేటలో ఏకంగా పదమూడు స్థానాలు చేజారిపోవడాన్ని వారు అంగీకరించలేకపోతున్నారు.
సిద్దిపేటలో మొత్తం 34 వార్డులున్నాయి. ఇందులో ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇకపోతే 28 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆశ్చర్యకరమైన రీతిలో ఇందులో 7 వార్డులలో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్ 2 చోట్ల గెలువగా, భాజపా కూడా రెండు స్థానాలు దక్కించుకుంది. ఎంఐఎం కూడా ఒక వార్డులో గెలిచింది. మిగిలిన 22 వార్డులు తెరాస పరం అయ్యాయి. దీంతో మునిసిపాలిటీ మీద గులాబీ జెండానే రెపరెపలాడనుంది.
అయితే సమీకరణాలు ఇంకా మరే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం గెలిచిన 7 మంది ఇండిపెండెంట్లలో 6గురు తెరాస రెబెల్ అభ్యర్థులే కావడం విశేషం. వీరికి తెరాసలోనే పెద్ద నాయకులు ఆశీస్సులు కూడా ఉన్నాయనే ప్రచారం ఉంది. గెలిచిన తర్వాత.. వీరు ప్రస్తుతం మళ్లీ తెరాసలో చేరిపోవడం పెద్ద విశేషం ఎంతమాత్రమూ కాదు. కాకపోతే.. మొత్తం మునిసిపాలిటీలో తెలుగుదేశానికి ఒకే ఒక వార్డు దక్కడం, అది కూడా అక్కడి తెదేపా నేత ఇండిపెండెంటుగా దాన్ని దక్కించుకోవడం.. ఆ పార్టీ ఉన్న దీని స్థితిని ప్రతిబింబిస్తోంది. స్వతంత్రులు ఆరుగురూ వచ్చి పార్టీలో చేరి.. బలపడితే తప్ప.. అసలైన కిక్ రాదని తెరాస నాయకులు అంటున్నారు.అచ్చంపేటలోనే క్లీన్ స్వీప్ చేసిన తమ పార్టీ.. ఇంత బలం ఉన్న సిద్దిపేటలో 22 వార్డులతో సరిపెట్టుకోవాలా అంటున్నారు.