మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ నిన్న తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది జరుగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలలో ఆమాద్మీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఆయనని ఎంపిక చేసిన కారణంగానే ఆయన భాజపాని వీడి ఆమాద్మీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భాజపా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన భార్య నవజ్యోత్ కౌర్ కూడా ఆమాద్మీ పార్టీలో చేరుతారని వార్తలు వచ్చాయి. భర్త ఒక పార్టీలో భార్య మరొక దానిలో కొనసాగడం చాలా కష్టం కనుక ఆమె కూడా పార్టీ మారుతారని అందరూ భావిస్తుంటే, ఆమె తను భాజపాలోనే కొనసాగుతానని చెప్పడం విశేషం. ఆమె ఇవ్వాళ్ళ ఉదయం మీడియాతో మాట్లాడుతూ, “నా భర్త రాష్ట్రానికి సేవచేయాలనే ఉద్దేశ్యంతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ నేను మాత్రం భాజపా ఎమ్మెల్యేగానే రాష్ట్రానికి సేవలందిస్తాను. మేము భార్యభర్తలమే కానీ రాజకీయంగా మాకు వేర్వేరు అభిప్రాయాలున్నాయి. కనుక నేను భాజపాలోనే కొనసాగుతాను. ఇప్పటివరకు శాసనసభ్యురాలిగా ఏవిధంగా రాష్ట్రానికి సేవ చేస్తున్నానో ఇకపై కూడా అదే విధంగా సేవ చేస్తాను,”అని కౌర్ అన్నారు. నిత్యం కీచులాడుకొనే భాజపా, ఆమాద్మీ పార్టీలలో చెరొకరు ఉన్నందున మున్ముందు వారికే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.
ఇక సిద్దూకి ఊహించిన సమస్యే ఎదురైంది. గతంలో ఆయన అరవింద్ కేజ్రీవాల్ పై చాలా ఘాటుగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన పంచనే చేరబోతున్నారని తెలియగానే, అప్పుడే భాజపా నేతలు ఆ విమర్శలని గుర్తు చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టారు. మీడియాలో కూడా సిద్దూ చేసిన ఆ విమర్శల వీడియో క్లిప్పింగులు ప్రసారం అవుతున్నాయి. చాలా మాటకారిగా పేరున్న సిద్ధూ ఏమని సర్ది చెప్పుకొంటారో చూడాలి? సిద్దు రాజీనామా, ఆమాద్మీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్ధిగా నిలబడటం గురించి మీడియాలో ఇన్ని వార్తలు వస్తున్నా ఇంతవరకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడం విశేషమే. ఆయన అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో అంట్ల గిన్నెలు తోముతూ, చీపురు పట్టుకొని గదులు ఊడ్చుతూ సేవ చేస్తున్నారు. పంజాబ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ప్రజలని ఆకట్టుకోవడానికే ఆయన ఆ డ్రామా ఆడుతున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు వాదిస్తున్నారు.