Sikandar Movie Review
తెలుగు360 రేటింగ్: 1/5
‘మనసు గెలిచనవాడే మహారాజు’ ఈ రోజుల్లో ఏ దర్శకుడైనా ఈ లైన్ చెప్పి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లలడా?! మురగదాస్ వెళ్ళాడు. అది కూడా సల్మాన్ ఖాన్ లాంటి బడా స్టార్ ని ఈ లైన్ తో ఒప్పించేసి ‘సికందర్’ అనే సినిమా తీశాడు. పండగ పూట సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మనసున్న మహారాజు కథ ఏమిటో? ఆ కథతో ప్రేక్షకుల మనసుని ఎంతలా గెలిచారో?
ముందే చెప్పుకున్నట్లు ఇదొక మహారాజు కథ. ఈ రోజుల్లో మహారాజులు ఎక్కడున్నారనే ధర్మ సందేహాలు వద్దు. మురగదాస్ లాంటి రాయల్ క్యారెక్టర్ ని సృష్టించారు. ఇక కథలోకి వెళ్ళిపోతే.. రాజ్ కోట్ ప్రాంతంలో సంజయ్ అలియాస్ సికందర్(సల్మాన్ ఖాన్) మకుటం లేని మహారాజు. ప్రజలని సొంత బిడ్డల్లా చూస్తాడు. స్థలాలు, పొలాలు దానం చేసి, గుళ్ళు, బళ్ళు కట్టించి, ఫ్యాక్టరీలు పెట్టి ఉద్యోగాలు ఇప్పించి.. ఒక్కటి కాదు..తన సొంత ఖర్చుతో అనేక సంక్షేమ పనులు చేస్తాడు. సంజయ్ భార్య సాయిశ్రీ( రష్మిక). భార్య అంటే సంజయ్ కి పంచప్రాణం. ఓ గొడవలో సాయిశ్రీ ప్రాణాలు కోల్పోతుంది. తన అవయవాలను ముగ్గిరికి దానం చేస్తుంది. ఈ ముగ్గురు ముంబైలో వుంటారు. ఈ ముగ్గురిని మినిస్టర్ ప్రధాన్(సత్యరాజ్) చంపాలని చూస్తుంటాడు. ఎందుకు? సంజయ్ కి ఆ మినిస్టర్ కి వున్న వైరం ఏమిటి? ఆ ముగ్గురిని సంజయ్ ఎలా కాపాడుతాడు? అనేది కథ.
ఈ కథ వినగానే ఆర్య, త్రిష, జేడి చక్రవర్తి నటించిన ‘సర్వం’ సినిమా గుర్తురాక మానదు. నిజానికి ఈ కథని అంత నిజాయితీగా తీసినా బావుండేది. ఇలాంటి లైన్ పట్టుకొని దర్శకుడు మురగ కథని కిచిడి చేసిన విధానం చూస్తే నవ్వాల్లో, జాలి పడాలో అర్ధం కాదు. నిజానికి సికిందర్ పై పెద్ద హైప్ లేదు. ట్రైలర్ కట్ రొటీన్ గా అనిపించింది. అయితే మాస్ మసాలా సినిమాలానైన ఉంటుందని థియేటర్స్ లో కూర్చుంటే.. ఏ దశలోనూ సినిమా రక్తికట్టలేదు. మురగదాస్ ఈ మధ్య ఫామ్ లో లేడు. అయితే ఆయన సినిమా అంటే ఎక్కడో చిన్న నమ్మకం. ఆ చిన్న నమ్మకాన్ని కూడా ఈ సినిమా నిలబెట్టలేకపోయింది.
విమానంలో హీరో మినిస్టర్ కొడుకుని కొట్టే సీన్ తో సినిమా ఓపెన్ అవుతుంది. ఆ ఫైట్ చిత్రీకరించిన విధానం చూసినప్పుడే సినిమా ఎంత కృత్తిమంగా వుంటుందో ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత పోలీసులు సంజయ్ ఇంటికి రావడం, మా దేవుడుని టచ్ చేయొద్దని ప్యాలెస్ చుట్టూ జనం గుమిగూడటం, తర్వాత అక్కడి ప్రజలు హీరోకి ఇచ్చే ఎలివేషన్.. ఇవన్నీ చూస్తున్నపుడు అసలు ఏ కాలంలో రావాల్సిన సినిమా ఇదనే అనుమానం కలుగుతుంది.
భార్య భర్తల ఎమోషన్ మీద ఫస్ట్ హాఫ్ రన్ చేయాలని చూశారు. రష్మిక, సల్మాన్ మధ్య వచ్చే సీన్స్ అస్సల్ కుదరలేదు. ఎమోషన్ పండలేదు. ఈ సినిమా సెకండ్ హాఫ్ అయితే ఇంకా వీక్ గా తయారైయింది. విలన్ ఎందుకుంటాడో తెలీదు. హీరో ఓ మూడు చోట్లకి తిరిగి ఒకొక్క చోట్ల ఒకొక్క క్లాస్ ఇస్తూ ఇస్తుంటాడు. ఈ తంతు చూస్తున్న ప్రేక్షకుడికి అసలు ఇది సల్మాన్ ఖాన్ సినిమా యేనా? మురగదాస్ డైరెక్ట్ చేశాడా? అనే అనుమానం ప్రతి సీన్ లో వస్తుంది.
లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ వున్న స్టార్ సల్మాన్. తనకి ఎంత బిల్డప్ వున్న పాత్ర అయినా నప్పుతుంది. అయితే సంజయ్ పాత్రలో బిల్డప్ వుంది కానీ బలం లేదు. చాలా పేలవంగా ఆ పాత్రని తయారు చేశారు. ఒక్క సీన్ లో కూడా వావ్ అనిపించేలా వుండదు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చినట్లు బౌన్సర్లు పెట్టుని అలా నిదానంగా వచ్చి నాలుగు డైలాగులు చెప్పే క్యారెక్టర్ తనది. సల్మాన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి సైతం రుచించదు. ఈ కథ అంతా రష్మిక చుట్టూ వుంటుంది. కానీ కథలో ఆమె పాత్ర వుండదు. అదే వెరైటీ. అప్పుడప్పుడు ఆకాశవాణిలా అవినిపించే ఆ పాత్రలో ఎమోషన్ రాకపోగ నవ్వు తెప్పిస్తుంది. ఇందులో కాజల్ వుంది. ఆమె చేయదగ్గ క్యారెక్టర్ కాదిది. అన్నట్టు ఇందులో త్రీ ఇడియట్స్ ఫేం శర్మాన్ జోషి వున్నాడు. చాలా మంచి నటుడు. ఆయన ఎందుకు ఈ పాత్రని ఒప్పుకున్నాడో అర్ధం కాదు. సత్యరాజ్, కిశోర్ పాత్రలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి.
టెక్నికల్ గా కూడా సినిమా గొప్పగా లేదు. ఫైట్లు తప్పితే మిగతా సీన్స్ లో టేకింగ్ సీరియల్ ఫీలింగ్ ని కలిగిస్తుంది. చాలా చోట్ల గ్రీన్ మ్యాట్ వాడకం కనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ కావాల్సిన దానికంటే ఎక్కువ సౌండ్ చేశాడు. బీజీఎం చాలా చోట్ల నాన్ సింక్ ఫీలింగ్ కలిగిస్తుంది. సల్మాన్ ఖాన్ కి టైగర్ జిందా హై తర్వాత మరో విజయం దక్కలేదు. ఆ అపజయాల పరంపరకు సికందర్ కూడా అడ్డుకట్ట వేయలేకపోయాడు.
తెలుగు360 రేటింగ్: 1/5