ఎట్టకేలకు `మా` మతలబులకు చెక్ పడింది. స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి… మరమ్మత్తులు ప్రారంభించడంతో – ఇక `మా` వ్యవహారం ఓ గాడిలోకి రాబోతున్నట్టే కనిపిస్తోంది. మా ఎన్నికల్ని సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని కోరుతూ.. చిరంజీవి కృష్ణంరాజుకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అంతకు ముందే.. నరేష్, ప్రకాష్‌రాజ్, హేమ, జీవిత తదితరులకు కూడా చిరంజీవి ఫోన్ చేశార్ట. `మాలో జరుగుతోందేం.. బాలేదు. ఎన్నికలు అయ్యేంత వరకూ.. ఎవరూ ఏం మాట్లాడొద్దు` అంటూ.. చిరు సున్నితంగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఇక మీదట ఎవ్వరూ… మా గురించి ఎలాంటి వ్యాఖ్యలూ చేయకూడదని నిర్ణయించుకున్నారని టాక్.
నిజానికి ఈ పనేదో చిరంజీవి కాస్త ముందు చేస్తే బాగుండేది. ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడో, దానికి కౌంటర్ గా నరేష్ మాట్లాడినప్పుడో చిరు కాస్త చొరవ చూపి ఉంటే.. మా వ్యవహారం అప్పుడే చక్కబడేది. కానీ ఒకరి మీద ఒకరు, ఒకరు తరవాత ఒకరు.. ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడేశారు. దాదాపుగా `మా`ని రోడ్డుమీదకు తీసుకొచ్చేశారు. ఇలా.. వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటూ పోతే.. `మా` ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, ప్రభుత్వ పెద్దల ముందు కూడా చిన్నబుచ్చుకోవాల్సివస్తుందని, భవిష్యత్తులో `మా` కోసం ఏమైనా అడిగాలన్నా – ఏమైనా సాధించుకోవాలన్నా – సాధ్యం కాదని – చిరు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు రంగంలోకి దిగాల్సివచ్చింది. ఇక మీదట ఎవరేం మాట్లాడాలనుకోవాలన్నా, ఏ సమస్య చర్చించాలన్నా అంతర్గత సమావేశాల్లోనే జరగాలని, ఆ సమావేశ వ్యవహారాలు బయటకు పొక్కకూడదని చిరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని, కృష్ణం రాజు కూడా `మా`లో కీలకమైన సభ్యులందరితోనూ మాట్లాడి, ఇదే విషయం చెప్పారని తెలుస్తోంది. సో.. `మా` ఇష్యూ ఇక క్లోజ్ అయినట్టే అనుకోవాలి.