ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఉద్యమాలకు ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో దానిపై ఒక సుదీర్గ పోరాటం చేయవచ్చనుకొన్న ఆయన తీవ్ర నిరాశ చెందారు. ఆ తరువాత ఆయన మళ్ళీ తన పోరాటాలు కొనసాగించేందుకు అంతటి బలమయిన అంశమేమీ లభించ లేదు. అందుకే వైకాపా నేతలు అందరూ ఇప్పుడు కల్తీ మద్యం, కాల్ మనీ, ఇసుక మాఫియాల గురించి మాట్లాడుతూ కాలక్షేపం చేసుకోవలసివస్తోంది. కానీ తెదేపా నేతలు చాలా తెలివిగా వ్యవహరిస్తూ వాటికి కూడా ప్రాధాన్యం కోల్పోయేలా చేయగలిగారు. కాల్ మనీ వ్యవహారంపై ఇప్పుడు మీడియాలో పెద్దగా వార్తలు కనబడటం లేదు. కనుక ప్రజలలో కూడా దానిపై ఆసక్తి తగ్గిపోయింది. అలాగని కాల్ మనీ బాధితులందరికీ న్యాయం జరిగగిందని కాదు. కాల్ మనీ, సెక్స్ రాకట్ నిందితులందరూ అరెస్ట్ అయ్యారని చెప్పడానికి లేదు. బహుశః కాల్ మనీ వ్యాపారులు అందరూ కొంత కాలం తమ కార్యకలాపాలు జోరు కట్టిపెట్టి నిశబ్ధం పాటిస్తునందునే మీడియాలో వారికి సంబంధించిన వార్తలు కనబడటం లేదేమో?
కనుక వైకాపా అధ్యక్షుడు జగన్, అతని పార్టీ నేతలు ఎప్పటికప్పుడు అందివచ్చే అంశాలపై ప్రభుత్వంతో పోరాటం చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ విరామ సమయంలో జగన్మోహన్ రెడ్డి యువతను తన పార్టీవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 21వ తేదీన కాకినాడలో యువభేరి కార్యక్రమం నిర్వహించాలనుకొన్నారు. కానీ ఆ కార్యక్రమం ఈనెల 27కి వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో విద్యుత్ చార్జీలు పెంచడానికి సన్నాహాలు చేస్తోంది కనుక దానిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోగానే వైకాపా మళ్ళీ ఆ అంశంపై పోరాడవచ్చును. కానీ ఉదృతపోరాటాలకి అలవాటుపడిన జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి చిన్న చిన్న సమస్యలతో స్వల్పకాలిక పోరాటాలు చేయడం కొంచెం కష్టంగానే ఉండవచ్చును.