తెలంగాణలో బయట మీడియాలో కనిపిస్తున్న దాని కంటే వాస్తవ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. కోదండరాం ప్రారభించిన ” తెలంగాణ జన సమతి” పార్టీ విషయంలో… బయట మీడియాలో పెద్ద ఎక్కువ హడావుడి కనిపించడం లేదు. కానీ కోదండరాం మాత్రం…తీరికగా లేరు. పార్టీ ప్రారంభించక ముందు నుంచే ఆయన పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేశారు. ఆవిర్భావ సభ తర్వాత.. ఆయన నేరుగా క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. మూలల నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
టీజేఏసీ అధ్యక్షునిగా ఉద్యమాన్ని ఎలా సంఘటితంగా నడిపించారో.. ఆ అనుభవాన్నంతా ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ఉపయోగిస్తున్నారు. నిజానికి ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వంపై.. తెలంగాణ కోసం పోరాడిన యువతలో తీవ్ర అసంతృప్తి ఉంది. కానీ వారికి పోరాడేందుకు సరైన ఫ్లాట్ ఫ్లాం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీలతో న్యాయం జరుగుతుందని వారు నమ్మలేరు. అందుకే వారంతా.. కోదండరాం నాయకత్వంలో నడిచేందుకు ముందుకు వస్తున్నారు. వీరిలో చాలా మంది ఉన్నత విద్యావంతులతో పాటు.. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఉన్నారు. వీరిలో చాలా మంది టీజేఎస్ కోసం ఆన్ లైన్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. కింది స్థాయి నేతల్ని ఎంపిక చేసుకునేందుకు ఆన్ లైన్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిని ఎంపిక చేసుకునేందుకు ఆన్ లైన్ పద్దతినే పాటిస్తున్నారు.
మరో వైపు కోదండరాం… జిల్లాలు తిరిగి ప్రత్యేకంగా వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. మనం కోరుకున్న తెలంగాణ ఏమిటి..? ఇప్పుడు జరుగుతున్నదేమిటన్నదానిపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీతో ప్రత్యక్షంగా లాభం పొందుతున్న వారు తప్ప… మిగతా జనం అంతా అసంతృప్తిగా ఉన్నారని..టీజేఎస్ వర్గాలు ఇప్పటికే గుర్తించాయి. వారందరూ కోదండరాం పట్ల సానుకూలంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ను కాదని.. మీడియా తెలంగాణ జనసమితికి ఓ మాదిరి ప్రచారం ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేదు. ఈ విషయం కోదండరాంకు కూడా తెలుసు. అందుకే ఆయన ప్రజల్లో బేస్ పెంచుకునేందుకు మీడియాపై ఆధారపడటం లేదు. కానీ చాపకింద నీరులా పార్టీని విస్తరించుకుంటూ పోతున్నారు.