తెలుగుదేశం హయాంలో లోకేష్, చంద్రబాబు బినామీలంటే వైసీపీ పెద్దలు తీవ్ర ఆరోపణలు చేసిన వారే ఇప్పుడు… ప్రభుత్వంలో ఎక్కడా లేని గౌరవాన్ని పొందుతున్నారు. గతంలో.. పెద్ద నోట్ల రద్దు సమయంలో కొత్త పెద్ద నోట్లతో దొరికిపోయిన శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అని వైసీపీ.. లోకేష్ బినామీ అని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు. అప్పుడు చంద్రబాబు ఆయనను టీటీడీ బోర్డు నుంచి తప్పించారు. వైసీపీ అధికారంలోకి రాగానే.. ఆయనకు టీటీడీ బోర్డు పదవిని మళ్లీ ఇచ్చింది. తాము గతంలో చేసిన ఆరోపణలు మర్చిపోయింది. తాజాగా.. నెల్లూరు జిల్లాలో అత్యంత విలువైన సిలికా గనులను… శేఖర్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి దక్కాయి. దక్కడం అనడం కంటే.. దక్కేలా చేశారంటే కరెక్టేమో..?
నెల్లూరు జిల్లాలో నాణ్యమైన సిలికా ఖనిజం లభిస్తుంది. ఈ సిలికాను.. ఇప్పటి వరకూ 80 వరకు చిన్న చిన్న కంపెనీలు లీజుకు తీసుకుని తవ్వకుంటూ ఉంటాయి. అయితే కొత్త ప్రభుత్వం రాగానే… ఆ లీజుల స్థానంలో టెండర్ల విధానం తీసుకు వచ్చింది. టన్నుకు రూ. 200 ధరను నిర్ణయించింది. అవంతిక సంస్థ రూ. 212 ఇచ్చేందుకు టెండర్ వేసింది. ఎక్కువే ఇచ్చింది కదా.. అని పైకి అనిపిస్తుంది. కానీ ఆ టెండర్లలో ఇప్పటి వరకూ అక్కడ సిలికా తవ్విన కంపెనీలకు పాల్గొనే అవకాశం లభించలేదు. దానికి కారణం… టెండర్లలో పాల్గొనే కంపెనీలకు రూ. 507 కోట్ల మైనింగ్ టర్నోవర్ ఉండాలి అర్హతగా పెట్టారు. దాంతో.. అన్నీ ఎలిమినేట్ అయిపోయాయి.
శేఖర్ రెడ్డికి తమిళనాడులో ఇసుక కింగ్ గా పేరు ఉంది. ఆయన ఏ మైనింగ్ వ్యాపారం చేసినా అది తమిళనాడుకే పరిమితం. ఇప్పుడు ఏపీలోకీ ఎంటరయ్యారు. చిన్న చిన్న మైనింగ్ వ్యాపారుల్ని 80 మందిని కొట్టేసి.. మొత్తం వెయ్యి ఎకరాల సిలికాను.. గుప్పిట పట్టేశారు. ఎంత తవ్వుతారు.. ఎంత తరలిస్తారు అనేది.. దేవుడికే తెలియాలి. ప్రభుత్వానికి ఎంత కడతారో ప్రభుత్వానికే తెలియాలి. మొత్తంగా చూస్తే… మైనింగ్ అంతా బడా బడా వ్యక్తుల చేతుల్లోకి సులువుగా చేరిపోతోందన్న క్లారిటీ మాత్రం వచ్చేస్తుంది.