నంద్యాల ఉప ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ అక్కడి రాజకీయం మరింత హాట్ హాట్ గా తయారౌతోంది. టీడీపీ నేతల్ని తమవైపు తిప్పుకోవడంపై వైకాపా ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. నిజానికి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూడా ఆ విధంగానే పార్టీలోకి వచ్చారు కదా! శిల్పా మోహన్ రెడ్డితోపాటు ఆయన అనుచరగణం కూడా టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో శిల్పా మోహన్ సోదరుడైన ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి కూడా పార్టీ వీడుతారనేది అప్పుడే అందరూ ఊహించారు. కానీ, కొన్నాళ్లపాటు చక్రపాణి రెడ్డి మౌనంగా ఉన్నారు. ఆయన పార్టీ మార్పుపై టీడీపీ వర్గాలు కూడా పెద్దగా కామెంట్స్ చేయలేదు. దీంతో ఆయన తటస్థంగా ఉంటారేమో అనే విశ్లేషణలు కూడా ఓ దశలో వినిపించాయి. అయితే, చక్రపాణి రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేయడం దాదాపు ఖాయం అనే ఇప్పుడు చెప్పొచ్చు.
ఈ మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం కార్యక్రమానికి చక్రపాణి రెడ్డి రాలేదు. ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాల తెలుగుదేశం నేతలందరూ రాత్రింబవళ్లు గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాల్లో తలమునకలై ఉంటే… ఈయన మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సో.. ఆయన టీడీపీని వదిలేసే ఆలోచనలో ఉన్నారనేది అప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది! కానీ, ఆ విషయంపై నేరుగా చక్రపాణిగానీ, టీడీపీ వర్గాలుగానీ ఇంతవరకూ ఎలాంటి కామెంట్లు చెయ్యలేదు. ఆయన రాబోతున్నట్టు వైసీపీ నేతలు కూడా ఎక్కడా మాట్లాడలేదు. అయితే, సోమవారం నాడు శిల్పా చక్రపాణిని, శిల్పా మోహన్ రెడ్డి కలుసుకున్నారు. వైకాపాలో చేరిన తరువాత తన సోదరుడితో భేటీ కావడం ఇదే ప్రథమం. ఈ ఇద్దరూ కాసేపు భేటీ అయిన తరువాత మీడియాతో శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడారు.
వైకాపాలో చేరిన తరువాత తన తమ్ముడిని కలుసులేకపోయాననీ, ఇన్నాళ్లకు వీలు చిక్కిందన్నారు. వైసీపీలోకి చక్రపాణి ఎప్పుడు వస్తున్నారు అనే ప్రశ్నకు శిల్పా మోహన్ రెడ్డి బదులిస్తూ… కొంత సమయం తీసుకుంటారనీ, అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తెలియజేస్తానని తనకు చెప్పినట్టు వివరించారు. ఇంకేముంది, ఆయన కూడా టీడీపీకి దూరం కాబోతున్నట్టు అధికారంగా కన్ఫర్మ్ అయినట్టే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఆయన పార్టీకి దూరమౌతారన్నది ముందుగానే ఊహించేదననీ, కానీ ఎన్నికల నేపథ్యంలో నేతలు పార్టీని వీడి వెళ్తుంటే.. కార్యకర్తల ఉత్సాహంపై దాని ప్రభావం పడే అవకాశం ఉంటుందని టీడీపీ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. చక్రపాణితోపాటు ఇంకెవరైనా నాయకులు కూడా వైసీపీకి వెళ్తారా అనే సెల్ఫ్ చెక్ ఆ పార్టీలో జరుగుతోందని తెలుస్తోంది. ఈ సందర్భంలో చక్రపాణిని ఆపే ప్రయత్నాలు టీడీపీ నుంచి ఉంటాయా అనేది అనుమానమే..!