రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలు తప్పవు అన్నట్టుగానే ఉంది! ఇప్పటికే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రాంతంలో కొంత పట్టు సాధించామన్న ఉత్సాహం ఎక్కువ కాలం నిలిచేట్టు లేదు. ఆ ప్రాంతంలో ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీకి ఎదురు దెబ్బ తప్పేట్టుగా లేదు! నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీని వీడే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు సీటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఆ ప్రాంతంలో ఉప ఎన్నిక అనివార్యమౌతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతోపాటు ఉప ఎన్నికలో కూడా అదే ఫ్యామిలీ నుంచి ఒకరికి సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే, భూమా మరణం తరువాత ఆ ఫ్యామిలీపై చాలా సానుభూతి ఉంది. సో.. భూమా కుటుంబానికే సీటు ఇస్తే గెలుపు సులువు అవుతుందని టీడీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం.
భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకు బ్రహ్మానందరెడ్డికి సీటు ఇవ్వొచ్చని అంటున్నారు. నిజానికి, భూమా రెండో కుమార్తె మౌనికా రెడ్డిని బరిలోకి దింపాలని అనుకుంటున్నా… ఆమెకి సరైన వయసు లేదన్న కారణంగా బ్రహ్మానందరెడ్డి పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. సో.. ఈ క్రమంలో శిల్పా వర్గానికి సీటు దక్కే పరిస్థితి లేదన్నది సుస్ఫష్టంగా ఉంది. దీంతో అసంతృప్తికి గురైనా శిల్పా మోహన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధపడుతున్నారట. ఇదే విషయమై తన అనుచరులతో శిల్పా చర్చించినట్టు సమాచారం.
వైకాపా నుంచి శిల్పాకి స్పష్టమైన హామీ లభించిందనీ అంటున్నారు. ఉప ఎన్నికల్లో వైకాపా తరఫున టిక్కెట్ కన్ఫర్మ్ అనీ, అందుకే ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు దాదాపుగా పూర్తి చేసుకున్నారనీ తెలుస్తోంది. మైనార్టీ ఓట్ల శాతం ఎక్కువగా ఉండటంతో, వైకాపా అభ్యర్థి గెలుపు సులువు అనే అంచనాతో శిల్పా వర్గం ఉంది. ఒకవేళ ఇప్పుడీ ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అయినా.. 2019లో శిల్పా గెలుపు ఈజీ అవుతుందని అనుకుంటున్నారట. మొత్తానికి, ఆయన టీడీపీని వదిలి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. అదే జరిగితే… సీమ రాజకీయాల్లో వైకాపా పట్టు బిగిస్తున్నట్టుగానే చెప్పుకోవాల్సి వస్తుంది.