సినిమా వాళ్లకు ప్రభుత్వ అవార్డులు ఎండమావి అయిపోయింది. ఇటు ఆంధ్ర ప్రదేశ్, అటు తెలంగాణ ప్రభుత్వాలు అవార్డులపై సీత కన్నేశాయి. జగన్, కేసీఆర్ సర్కార్లు సినిమాని లైట్ తీసుకొన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. వాళ్ల విధానాలూ మారాయి. అందుకే అవార్డుల ప్రక్రియ మళ్లీ మొదలవుతోంది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తరవాత సినిమా వాళ్లకు ‘సింహా’ అవార్డులు అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందుకు కసరత్తులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే సింహా అవార్డులు ప్రకటన, ప్రధానం జరగబోతోందని సమాచారం అందుతోంది. ఇందుకు సంబంధించిన ఓ కార్యాచరణ ప్రణాళిక రెడీ అయ్యిందని టాక్.
ఉగాది సందర్భంగా అవార్డులు ప్రదానం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సమయం తక్కువగా ఉంది. ఈలోగా అవార్డుల ప్రకటన జరగడం కొంచెం కష్టమైన పనే. ప్రతీ యేటా వచ్చిన సినిమాల్లో ఉత్తమ చిత్రాల్ని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకొని అవార్డులు అందించడం ఓ ప్రక్రియ. అయితే ఈసారి… తెలంగాణ కళాకారుల్ని కొంతమందిని ఎంచుకొని, వాళ్లని ‘గద్దర్’ అవార్డులతో సత్కరించాలని భావిస్తున్నారు. ఈవారంలోనే ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. అసలే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా రంగానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఈ విషయంలో మీన మేషాలు లెక్కించకుండా ఉంటే మంచిది.