వందకోట్ల మంది ఆశలు నెరవేరలేదు. వేల మంది పూజలు ఫలించలేదు. భారత్ కు బ్మాడింటన్ లో స్వర్ణ పతకం దక్కలేదు. రియో ఒలింపిక్స్ లో సింధు రజత పతకంతో తన ప్రస్థానం ముగించింది. ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళ అనే ఖ్యాతి మాత్రం దక్కించుకుంది.
స్పెయిన్ అమ్మాయి కరోలినాలో అడుగడుగునా ఆత్మ విశ్వాసం తొణికిసలాడింది. ప్రారంభం నుంచీ ఒక ఛాంపియన్ లాగే ఆడింది. కొండంత ఆత్మవిశ్వాసంతో ఆడింది. సింధు మాత్రం తడబడిది. కొద్ది సేపు విశ్వాసం తెచ్చుకుంది. కాసేపటికే దాన్ని కోల్పోయింది. చివరకు మూడు సెట్ల వరకూ జరిగిన ఈ మ్యాచ్ లో కరోలినా 19-21, 21-12, 21-15 స్కోరుతో విజయం సాధించింది. పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. సింధుకు రజత పతకం దక్కింది.
హోరాహోరీ పోరాటంలో తొలిసెట్ ను సింధు కైవసం చేసుకుంది. అది ఎంతో ఆత్మవిశ్వాసం ఇవ్వాలి. రెట్టించిన ఉత్సాహంతో రెండో సెట్ఆడాలి. ప్రత్యర్థిపై విరుచుకు పడి పాయింట్లు సాధించాలి. కానీ ఏమైందో ఏమో పూర్తి డిఫెన్స్ లో పడిపోయింది.
ప్రత్యర్థి చిరుతపులిలా రెచ్చి పోయి ఆడింది. సింధు లేడిపిల్లలా బెంబేలెత్తిపోయింది. రెండో సెట్లో సింధు ఆటతీరు ఓ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిలా లేదు. భయపడుతూ, తడబడుతూ పాయింట్లు సమర్పించుకుంది. ఫలితం… కరోలినా సునాయాసంగా ఆ సెట్ లో విజయం సాధించింది.
మూడో సెట్ ప్రారంభం నుంచీ కరోలినా అదే దూకుడు ప్రదర్శించింది. సింధు మళ్లీ ఆత్మరక్షణలో పడింది. ప్రత్యర్థి 10 పాయింట్లకు చేరే వరకూ సింధులో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. ఒక దశలో 10-10తో స్కోరు సమమైంది. ఇకనైనా సింధు దూకుడుగా ఆడి గెలుస్తుందని, స్వర్ణ పతకం సాధిస్తుందని భారత్ అభిమానులు ఆశపడ్డారు. కానీ చివరకు నిరాశే మిగిలింది.